BRS Party Leaders Protest Telangana Bhavan about Change of Telangana talli statue: తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంపై తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం.. తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్ విగ్రహమని ఆరోపించారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు.
అయితే, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇక, విగ్రహావిష్కరణ నేపథ్యంలో నిరసనలు ఉధృత్తమయ్యాయి. ఇందులో భాగంగానే తెలంగాణ భవన్‌లో కార్పొరేటర్లు, నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కవిత నిరసన వ్యక్తం చేసింది. అనంతరం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి కవిత పాలాభిషేకం చేసింది. ఇక, తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు చేపడుతోంది. జనగామలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. వేలాది ఉద్యమకారులు ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారన్నారు. ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి అంగీకరించడం లేదన్నారు. అలాగే బతుకమ్మ పండగను విగ్రహంలో ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.
తెలంగాణలో తొమ్మిది మంది కళాకారులను సన్మానిస్తామన్నారని, కళాకారుల జాబితాలో మహిళలు ఎక్కడ అని ప్రశ్నించారు. విమలక్క, మల్లు స్వరాజ్యం, సంధ్య వంటి వారు కనిపించలేదా అన్నారు. తెలంగాణ పేద ప్రజలు ఎప్పికీ అలాగే ఉండిపోవాలా.. మహిళలకు ఎన్నికల సమయంలో ఇస్తానన్న రూ.2,500 ఏమైందన్నారు. స్ఫూర్తి నింపే తెలంగాణ తల్లి విగ్రహం కాదని.. కాంగ్రెస్ తల్లిని పెట్టుకున్నారని కవిత విమర్శలు చేశారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరించింది. అయితే తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చినా.. తొలగించినా చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టించేశారు. అయితే, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విగ్రహాలలను మారుస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాగా, మార్చేందుకు వీలు లేకుండా జీఓ జారీ చేసేలా రేవంత్ రెడ్డి చెబుతున్నారు.