BRS Leaders House Arrest Over Protest At Tank Bund in hyderabad: కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో సంబరాల్లో బిజీబిజీగా ఉండగా..బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం నిరసనలతో హోరాహోరీగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు, రాజేశ్వర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చేసేందుకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే ట్యాంకుబండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్‌లో హైటెన్షన్ నెలకొంది.
బీఆర్ఎస్ ధర్నాకు పిలుపు ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని పలు చోట్ల ఆంక్షలు విధించారు. ట్యాంకు బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నాయకులు ట్యాంకుబండ్ వద్దకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అలాగే కొంతమందిని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. కోకాపేట్‌లో మాజీ మంత్రి హరీష్ రావును అరెస్ట్ చేయగా.. కుత్బుల్లాపూర్ వద్ద ఎమ్మెల్యే వివేకానంద, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులను కూడా హౌస్ అరెస్ట్ చేశారు.
అలాగే, నందిహిల్స్‌లో ఎమ్మెల్సీ కవితను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. గ్రేటర్ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యనేతల ఇళ్ల దగ్గరకు పోలీసులు చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నాయకులు వారు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు భారీగా మోహరించారు. దీంతో తమపై ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అరెస్టులు, నిర్బంధాలను ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు మా పార్టీ నేతలను వెళ్లనియకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. నిర్బంధాలు నిరంకుశ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేస్తూ.. మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేయడం ఏంటన్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలన్నారు.
కాగా, బీఆర్ఎస్ నేతల ఆందోళనలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహాల దగ్గర రాజకీయాలు సరికాదన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారన్నారు. సలహాలు, సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోమన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకు?
ఇది నీ నిరంకుశ, నియంతృత్వ పాలనకు… pic.twitter.com/GBDaSiTwnw
— Harish Rao Thanneeru (@BRSHarish) December 6, 2024