Telangana Assembly: అసెంబ్లీలో లగచర్లపై పట్టు.. నల్లచొక్కాలు, బేడీలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

BRS demand on Lagacharla farmers arrest issue in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు  వాడీవేడిగా కొనసాగుతున్నాయి. లగచర్ల రైతుకు బేడీలు వేయడాన్ని తప్పు పడుతున్న బీఆర్ఎస్ చర్చకు పట్టు పడుతోంది. ఈ మేరకు అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన రైతులకు సంఘీభావంగా ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు అసెంబ్లీకి బీఆర్ఎస్ సభ్యులు నల్లచొక్కాలు, టీషర్టుల్లో బేడీలు వేసుకొని వచ్చారు.

కాగా, అలాగే పంచాయతీ రాజ్, ఆర్ఓఆర్ సవరణ బిల్లులను తెలంగాణ ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. అయితే మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై సోమవారం సభలో అధికార, విపక్షాల మధ్య చర్చలు వాడీవేడిగా జరిగాయి.

ఇదిలా ఉండగా, ఎఫ్ఆర్బీఎం రుణాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చించారు.  అప్పుల వివరాలను భట్టి విక్రమార్క ప్రకటించారు.  2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు 51వేల 200 కోట్లు అని వెల్లడించారు. అయితే భట్టి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.  రాష్ట్రానికి రూ.7లక్షల కోట్ల అప్పు ఉందనేది తప్పు అని అన్నారు. కాగా, సభను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అప్పులపై చర్చ జరగాలనే శ్వేతపత్రం విడుదల చేశామని వెల్లడించారు. అప్పులపై చర్చకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు.

బీఆర్ఎస్ నేతలు వాస్తవాలు మాట్లాడడం లేదని భట్టి విక్రమార్క అన్నారు. అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, అప్పుల లెక్కలను మేం స్పష్టంగా వివరించి చెప్పామని వివరించారు. అధికారం పోయాక వాళ్లకు మతిపోయినట్టుందన్నారు. గత ప్రభుత్వం అప్పులను దాచిపెట్టిందని, మేము వివరంగా చెప్పామన్నారు. మీరా మాపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభకు, సభాపతికి బీఆర్ఎస్ గౌరవం ఇవ్వడం లేదని భట్టి విక్రమార్క అన్నారు. బీఏసీ సమావేశంలో కూడా బీఆర్ఎస్ వాకౌట్ చేసిందని,  గడిచిన పదేళ్లు బీఏసీ సమావేశం ఎలా నిర్వహించారో మర్చిపోయారా? అని ప్రశ్నించారు.