Bidar Gang Hulchul in Hyderabad: అఫ్జల్‌గంజ్‌లో బీదర్ దొంగల ముఠా కాల్పుల ఘటన కలకలం రేపింది. దొంగల ముఠాను పట్టుకునేందుకు బీదర్ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. అప్జల్‌గంజ్‌లో పోలీసులను చూసిన దొంగల ముఠా సభ్యులు తప్పించుకునే ప్రయత్నంలో కాల్పులు జరిపారు. అనంతరం ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్లి ట్రావెల్స్ మేనేజర్‌పైనా కాల్పులు జరిపారు. ఘటన తర్వాత దొంగల ముఠాలోని ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈస్ట్ జోన్ డీసీపీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
హైదరాబాద్‌లో ప్రత్యక్షం..
కర్ణాటకలోని బీదర్‌లో పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. నగరం నడిబొడ్డున శివాజీ చౌక్‌లోని ఓ ఏటీఎం కేంద్రంలో డబ్బు పెట్టేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు కాల్పులు జరిపారు. ఘటనలో భద్రతా సిబ్బంది ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. దుండగులు ఏటీఎం సొమ్మును చేజిక్కించుకుని ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. దొంగలు అఫ్జల్‌గంజ్‌లో ఉన్నట్లు తెలుసుకున్న బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్‌రాగా నిందితులు కాల్పులకు తెగబడ్డారు.