AP Registration Charges Hike: ఏపీలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. పట్టణాల్లో, గ్రామాల్లోనూ పెరిగిన కొత్త ఛార్జీలు ఒకేసారి అమలులోకి రానున్నాయి. భూముల విలువ సుమారు 15 శాతం వరకు పెరగనున్నాయి. ఇప్పటికే కలెక్టర్ నేతృత్వంలో భూ విలువలు సవరణలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
అయితే ఈ ప్రతిపాదనలు జిల్లా కమిటీలు ఆమోదించిన తర్వాత ఈ నెల 20న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నోటీస్ బోర్డులో ప్రదర్శించనున్నారు. ఈనెల 24 వరకు అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి ఈనెల 27 వరకు అభ్యంతరాలను పరిశీలించనున్నారు. అనంతరం కొత్త ఏడాది నుంచి నూతన భూ రిజిస్ట్రేషన్ ఛార్జీలను అమలులోకి తీసుకురానున్నారు.
అయితే, ప్రస్తుతం పెరిగిన ఛార్జీలతో భూముల రిజిస్ట్రేషన్ ఖర్చులు సైతం కొంత పెరిగే అవకాశం ఉంది. ఈ భూ రిజిస్ట్రేషన్ల ధరలు పెరగడంతో రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరగనుంది. దీంతో పాటు భూముల ధరలకు మార్కెట్ విలువకు అనుగుణంగా పెరిగే ఛార్జీలను సమన్వయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూమి విలువ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సమీక్ష నిర్వహించి మార్పులు చేసేందుకు ప్రతిపాదనలు విడుదల చేసింది.
ఇదిలా ఉండగా, భూ రిజిస్ట్రేషన్ల ధరలు పెంచడం కారణంగా ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. కొంతమంది సమర్థిస్తుండగా.. మరికొంతమంది విమర్శలు చేస్తున్నారు. ధరలు పెరిగితే మరో భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భూ కొనునగోలు చేసే వ్యాపారాలపై విపరీతంగా ప్రభావం చూపనుందని తెలుస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.