AP High Court shock to Ex RTI Commissioner Vijay Babu: మాజీ సమాచార కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ విజయ్‌బాబుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడుతున్నారంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మండిపడింది. ఈ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆయనకు రూ.50 వేల జరిమానా ఏపీ హైకోర్టు విధించింది. వైకాపాకు మద్దతుగా విజయ్‌బాబు తరచూ టీవీ చర్చల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.
ఇదీ పిటిషన్ సారాంశం..
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తున్నవారిపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవటం భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకమని విజయ్ బాబు తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ పిల్ విషయంలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, వైకాపా ప్రభుత్వంలో ఏజీగా పనిచేసిన ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ విషయంలో కోర్టు జోక్యంచేసుకుని ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఏదీ ప్రజా ప్రయోజనం..
కాగా, దీనిపై హైకోర్టు మండిపడింది. సమాజంలో తమ బాధను చెప్పుకోలేని వారి కోసం వేయాల్సిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని రాజకీయ దురుద్దేశంతో వేశారని కోర్టు అభిప్రాయపడింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు తమ హక్కులు తెలుసుకోకుండానే పోస్టులు పెడుతున్నారా అని న్యాయస్థానం ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగిస్తున్నారని, వారి తరపున పిటిషన్ వేయాల్సిన అవసరం ఏముందని కోర్టు ప్రశ్నించింది.
తప్పెలా అవుతుంది?
సామాజిక మాధ్యమం వేదికగా 2 వేల మంది ఒకే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దూషణలు చేస్తూ, అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని..వారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పెలా అవుతుందని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఒకే ఉద్దేశంతో వందల మంది అభ్యంతరకర పోస్టులు పెడుతుంటే.. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పెలా అవుతుందని నిలదీసింది. ఒకే పద్ధతిలో కేసులు పెడుతోంది పోలీసులు కాదని, సోషల్ మీడియాలోనే ఒకే విధానంలో దురుద్దేశంతో పోస్టులు పెడుతున్నారని వ్యాఖ్యానించింది.
కిరాయి మూకలపై ప్రేమా?
పిటిషనర్ చెప్పినట్లు వారు సోషల్ మీడియా కార్యకర్తలు కాదని, కిరాయి మూకలని కోర్టు వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అభ్యంతరకర భాష వాడుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ఇటువంటి కామెంట్లు ధర్మ బద్దంగా ఉండే వారిని కించ పరిచే విధంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా వేదికలను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుంటామంటే చట్టం ఒప్పుకోదని, న్యాయ పరంగా ఇది నేరం అవుతుందని హైకోర్టు హెచ్చరించింది.
రూ.50వేలు ఫైన్..
తప్పుడు పోస్టులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, చర్యలు తీసుకోకుండా తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విజయ్‌బాబు పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు ఆయనకు రూ.50 వేల జరిమానా విధిస్తూ.. యాభై వేల రూపాయల జరిమానాను లీగల్ సర్వీసెస్ అథారిటీలో నెల రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. అంధులు, బధిరుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఆదేశించింది.