AP Govt New Rules in Land Registration: ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తగ్గుదల, మరికొన్ని ప్రాంతాల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సిసోడియా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఆదేశాలు ఇచ్చారు.
మొరాయించిన సర్వర్లు..
ఏపీలో రిజిస్ట్రేషన్ సర్వర్లు మొరాయించాయి. రెండు రోజులుగా ఓపెన్ కావడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1నుంచి కొత్త మార్కెట్ ధరలు అమలు కానుండటంతో రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం తాకిడి పెరిగింది. దీంతో సీఎఫ్‌ఎంఎస్ సర్వర్ ఓపెన్ కావడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. అయితే నేడు ఒక్కరోజే సమయం ఉండటంతో ఇదే పరిస్థితి ఉంటుందని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు.
రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో..
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే మంగళవారం, బుధవారాల్లో అమావాస్య రావడంతో రెండు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తారు. ఇంతకుముందు మంత్రి అనగాని సత్యప్రసాద్ గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు చెప్పారు. కొన్ని చోట్ల ధరలు తగ్గితే, మరికొన్ని చోట్ల పెరగనున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి అనగాని తెలిపారు.