Site icon Prime9

AP WhatsApp Governance: నేటి నుంచే వాట్సప్ గవర్నెన్స్.. ఫిర్యాదులు, వినతులు, సలహాలకూ అవకాశం

AP Government services available on WhatsApp from today: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కారు మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. పాలనకు సాంకేతికత మెరుగులు అద్దే క్రమంలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సప్ గవర్నెన్స్ అనే వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా మెజారిటీ ప్రభుత్వ సేవలన్నీ మొబైల్‌లోని వాట్సప్ యాప్‌ కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దీనివల్ల ప్రజలు ప్రతి పనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని, అటు అధికార యంత్రాంగంలోనూ జవాబుదారీతనం పెరుగుతోందేని కూటమి సర్కారు యోచనగా ఉంది. ఈ సేవలను ఐటీ, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ నేడు అధికారికంగా ప్రారంభించనున్నారు.

పౌరసేవలన్నీ ఒకేచోట..
రాష్ట్ర ప్రభుత్వం అందించే పౌర సేవలు, ప్రజలు తమ సమస్యల మీద చేసే ఫిర్యాదులు, పథకాల విషయంలో చేసుకునే విజ్ఞప్తులను సత్వరం పరిష్కరించేందుకు ఏపీ సర్కారు వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. దీనిపై బుధవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తొలి దశలో 161 సేవలు పౌరులకు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు. దీనికోసం ప్రభుత్వం అధికారిక వాట్సప్‌ నంబర్‌ను ప్రకటిస్తుందని, ఆ ఎకౌంట్‌కు వెరిఫైడ్‌ ట్యాగ్‌ (టిక్‌ మార్క్‌) ఉంటుందని, ఈ నంబరు వన్‌స్టాప్‌ సెంటర్‌లా పనిచేస్తుందని ఆయన వివరించారు.

సమాచారం నుంచి పథకాల వరకు
ఈ వాట్సప్ గవర్నెన్స్ అమలుతో ప్రభుత్వం ప్రజలకు సమాచారాన్ని నేరుగా, వేగంగా అందించే అవకాశం ఏర్పడనుంది. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, వాటి పురోగతి, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వాతావరణ మార్పులు తదితరాలను ఎప్పటికప్పుడు ఏకకాలంలో కోట్ల మందికి ప్రభుత్వం పంపుతుంది. అలాగే, ప్రభుత్వం అందించే పథకాలు అందని వారు ఇకపై, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా, నేరుగా తమ వాట్సప్ నంబరు నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవచ్చు. అలాగే తాముండే ప్రాంతాల్లో ఏమైనా సమస్యలు ఎదురవుతుంటే..నేరుగా ఫిర్యాదుచేస్తే, అవి ఆయా శాఖల అధికారులకు చేరతాయి. తమ ఫిర్యాదు, వినతులు ఏ దశలో ఉన్నాయని కూడా వాట్సప్ వినియోగదారుడు ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ఈ వాట్సప్ గవర్నెన్స్‌లో ఉంటుంది.

ఆర్టీసీ నుంచి ఆలయాల టిక్కెట్లకూ..
ఇకపై, వాట్సప్ యాప్ నుంచి ప్రజలు నేరుగా తమ బస్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఏపీ పరిధిలోని అన్ని దేవాలయాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వాట్సప్‌ద్వారా పంపుతారు. ఎవరైనా భక్తులు అక్కడికి వెళితే, వాట్సప్ ద్వారానే సదరు ఆలయ దర్శన టికెట్లు, గదుల బుకింగ్, గుడికి విరాళాల చెల్లింపు వంటివి చేయవచ్చు. అలాగే ఇకపై కరెంటు బిల్లులు, మొబైల్, కేబుల్ రీచార్జ్, ఆస్తి పన్నులు ఈ అధికారిక వాట్సప్ ద్వారా చెల్లించవచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం పెట్టాలనుకునే వారు నేరుగా దీని నుంచే ట్రేడ్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థుల స్కాలర్‌షిప్ లావాదేవీలు, రెవెన్యూ లాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు కూడా తీసుకునే వెసులు బాటు ఉంది. ఈ మేరకు ప్రజలు వినతులతో పాటు ఫిర్యాదులు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మెసేజ్ చేస్తే.. వెంటనే లింక్ వస్తుంది. ఇందులోనే సంబంధిత వ్యక్తి పేరు, ఫోన్ నంబర్, చిరునామా పొందుపర్చారు. వెంటనే రిఫరెన్స్ నంబర్ వస్తుండగా.. దాని ఆధారంగా వినతులపై పరిష్కారం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రధానంగా మురుగు కాల్వలు, లీకేజీలు, రోడ్లు, గుంతలు ఫొటోలు తీసి పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది.

సైబర్ నేరాలకు చెక్..
అలాగే పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఉన్నతాధికారులను సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. 2024 అక్టోబరు 22వ తేదీ.. వాట్సాప్ ద్వారా ఈ పౌర సేవలు అందించేందుకు మెటా సంస్థతో కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్న విషయం విదితమే. అలాగే సమాచార గోప్యతతోపాటు వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్‌ను వినియోగించనున్నారు.

Exit mobile version
Skip to toolbar