Pawan Kalyan-Modi: ప్రధాని మోదీతో జనసేనాని భేటీ.. ఏపీ ప్రాజెక్టులు, రాజకీయాలపై చర్చ

AP Dy CM Pawan Kalyan meets PM Narendra Modi in Delhi: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన మూడవ రోజూ బిజీబిజీగా సాగింది. తన పర్యటనలో భాగంగా ఆయన బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని పవన్.. ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

థాంక్యూ పీఎం సార్..
ప్రధానితో భేటీ అనంతరం పవన్ ఎక్స్ మాధ్యమంలో తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘పార్లమెంట్ సమావేశాల వేళ.. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ, ఆ సమయంలోనే కొంత తన విలువైన సమయాన్ని నా కోసం వెచ్చించినందుకు ప్రధానికి థాంక్స్. గాంధీనగర్‌లో ఆయనను తొలిసారి కలిసినప్పటి నుంచి ఈనాటి సమావేశం వరకు ఆయనలో అదే తపన, ఉత్సాహం. దేశం పట్ల ఆయనకు ఉన్న ప్రేమ, నిబద్ధత ఎప్పటికీ స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయి’ అని పవన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. దేశాభివృద్ధిలో ఏపీ వంటి రాష్ట్రాలు సాధికారత సాధించటం చాలా కీలకమని ఈ సమావేశంలో ఆయనకు చెప్పానని పవన్ తెలిపారు.

భూపేంద్ర యాదవ్‌తో భేటీ..
ప్రధానిని కలిసేందుకు ముందుగా.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌…. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ను కలిశారు. ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ కట్టడి, దుంగల అమ్మకం విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగిల్ విండో విధానానికి మార్చాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఇలా మార్చితే.. అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనానికి నిర్వహించే ‘ఈ వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని తెలియజేశారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇదే మాట చెప్పిందని పవన్ గుర్తుచేశారు. ఈ విధానానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ కస్టోడియన్‌గా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఇక.. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పవన్‌ అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంలో ఏపీకి రావాల్సిన వాటా మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నోడల్‌ ఏజెన్సీ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం చొరవ చూపలేదని మండిపడ్డారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి బొబ్బిలి వీణను బహూకరించారు.

బీఎల్ సంతోష్‌తో చర్చలు..
జనసేన అధినేత పవన్.. బుధవారం సాయంత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్స్) బీఎల్ సంతోష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు వర్తమాన రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం పవన్ ఆయనకు.. తిరుపతిలో విడుదల చేసిన వారాహి డిక్లరేషన్ హిందీ కాపీని అందజేశారు.

చిన్మయ్ అరెస్ట్‌పై ఆందోళన…
బంగ్లాదేశ్‌లో ఇస్కాన్‌ ప్రచారకులు చిన్మయ్‌ కృష్ణదాస్‌ అరెస్ట్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బుధవారం ఖండించారు. దీనిపై అందరూ కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పవన్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకున్న తీరు తమను తీవ్రంగా కలచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా, బంగ్లాదేశ్‌లోని హిందువులపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడేలా గట్టి చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం 1971లో భారత సైన్యం రక్తం చిందించిందని.. నాటి పోరులో భారత్ పెద్దమొత్తంలో తన ఆర్థిక వనరులను వెచ్చించిందని, ఈ యుద్ధంలో పలువురు భారత జవాన్లు అమరులయ్యారని గుర్తుచేశారు. కొందరు పాలస్తీనాలో దాడులు జరిగితే హైదరాబాద్‌ పాతబస్తీలో లేచి మాట్లాడుతారని, మరి ఆ నేతలు పొరుగునే ఉన్న, మనతో అనుబంధం ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులను ఊచకోత కోస్తుంటే.. స్పందించక పోవడం ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు.

ఎన్డీయే ఎంపీలకు విందు
ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం పవన్ తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు విందును ఏర్పాటు చేశారు. తాజ్ హోటల్‌లో జరిగే ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల బీజేపీ, జనసేన, టీడీపీ ఎంపీలు హాజరయ్యారు.

పవన్ ఎఫెక్ట్
ఏపీ పర్యాటక రంగ అభివృద్ధికి పవన్ కల్యాణ్ తీసుకుంటున్న చర్యలు, చొరవ మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఏపీ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన సాస్కి-2024-25 ద్వారా తొలి విడతగా రూ.113.751 కోట్లు (66 శాతం) విడుదల చేశారని, ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి బుధవారం తెలిపారు. ఈ తొలి విడత నిధుల్లో 75 శాతం వాడిన తర్వాత మిగిలిన నిధులు (34 శాతం) విడుదల చేస్తామని కేంద్రం తెలిపిందని పేర్కొన్నారు. సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధితో బాటు అక్కడ టూరిస్టుల కోసం మౌలిక వసతులు, సౌకర్యాలను కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. పాకిస్తాన్‌లో దాడులు జరిగితే హైదరాబాద్‌ పాతబస్తీలో లేచి మాట్లాడుతారు. పక్క దేశంలో బంగ్లాదేశ్‌లో ఊచకోత జరిగితే భారతదేశం సమాజం స్పందించక పోవడం ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు ప్రాథమిక బాధ్యతగా గుర్తించి మాట్లాడాలని కోరారు. నిధుల విడుదలకు చొరవ చూపిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్‌లా అభివృద్ధి చేయవచ్చన్న పవన్ కళ్యాణ్ ఆలోచనలను త్వరలోనే ఆచరణలో చేసి చూపిస్తామని అన్నారు. కేంద్రం ఇలాగే సహకరిస్తే, రాబోయే ఐదేళ్లలో ఏపీని పర్యాటక రంగంలో నెంబర్ 1గా తీర్చిదిద్ది చూపుతామన్నారు.