Pawan Kalyan: అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు.. సంక్రాంతి నాటికి పెండింగ్ పనులు పూర్తి

AP Deputy CM Pawan Kalyan Visit Gudavalluru Krishna: ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యత లోపిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఈ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలిన జనసేనాని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణలో భాగంగా శుక్ర, శనివారాల్లో మన్యంలో పర్యటించిన జనసేనాని, సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజా ప్రతినిధులతో బాటు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

బిజీబిజీగా పర్యటన..
సోమవారం పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు జనసేనాని కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గొడవర్రు గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గొడవర్రు – రొయ్యూరు రోడ్డు పనులను పవన్‌ పరిశీలించారు. ఇటీవల పల్లె పండుగ పేరిట కంకిపాడులో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ విజ్ఞప్తి మేరకు ఆధ్వాన్నంగా ఉన్న రొయ్యూరు రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలంటూ పవన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు పనులు తుదిదశకు చేరుకోవడంతో పవన్‌ పరిశీలించారు.

స్వయంగా పరీక్షలు
ఈ క్రమంలో బీటీ రోడ్ వేసే కాంట్రాక్టర్ వివరాలు, ఎంత సమయం పడుతుంది? వంటి వివరాలను పవన్ అడిగి తెలుసుకున్నారు. మొత్తం 4.67 కి.మీ రోడ్డు పనులలో ఇప్పటికే 1 కి.మీ రోడ్డు నిర్మాణం పూర్తైందని, మిగతా 3.67 కి.మీ రోడ్డు నిర్మాణ దశలో ఉందని, సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం రోడ్డు నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించేందుకు వేసిన రోడ్డులోని ఒకచోట అడుగు మేర తవ్వించి, బీటీ రోడ్డు మూడు లేయర్ల నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. ఆ తవ్విన మెటీరియల్ సేంపిల్స్ పరీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా రూ.3.75 కోట్ల వ్యయంతో కంకిపాడు బస్టాండ్ నుంచి గొడవర్రు మీదుగా రొయ్యూరు వెళ్ళే ఆ రహదారి పనుల పురోగతిని అధికారులను అడిగి పనులు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు.

ఫిల్టర్ బెడ్స్ చెకింగ్..
అనంతరం జనసేనాని గొడవర్రు నుంచి గుడివాడ రూరల్ మండలంలోని మల్లాయపాలెం వాటర్ వర్క్స్ వద్దకు చేరుకోగా, అక్కడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో వందలాది మంది పవన్‌కు ఘన స్వాగతం పలికారు. మల్లాయపాలెం త్రాగునీటి చెరువు.. హెడ్ వాటర్ వర్క్స్ పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌కు జిల్లా కలెక్టర్ బాలాజీ ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుద్ధి చేసే విధానాన్ని వివరించారు. అనంతరం ఇటీవల పవన్ కల్యాణ్‌ చొరవతో విడుదలైన రూ.2.27 కోట్లతో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో మరమ్మత్తులు చేసిన ఫిల్టర్ బెడ్ల ద్వారా సరఫరా అవుతున్న స్వచ్ఛమైన త్రాగునీటి నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన నీటి సరఫరా వ్యవస్థ ఫోటో ప్రదర్శనను ఆసక్తిగా జనసేనాని తిలకించారు.

మాట నిలుపుకున్న పవన్..
అక్టోబరు మాసంలో కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన పవన్‌కు స్థానిక ఎమ్మెల్యే రాము నియోజక వర్గంలోని పలు గ్రామాలలో జనం తాగునీటి కోసం పడుతున్న అగచాట్ల గురించి వివరించగా, వెంటనే రూ. 3.8 కోట్ల నిధులు మంజూరు చేశారు. కాగా, ఆ పనులను కేవలం రెండు నెలలలోనే పూర్తి చేయించగలిగారు. దీనివల్ల గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 44 గ్రామాలకు రక్షిత మంచినీటి సరఫరా జరగనుంది. అలాగే, 14 గ్రామాల పరిధిలో ఒక్కో పంచాయితీకి రూ. 4 లక్షలు కేటాయించి ఫిల్టర్ బెడ్లు మార్చారు. అదే సమయంలో గత పర్యటనలో కైకలూరు వాసులకు ఇచ్చిన మాట ప్రకారం.. గొడవర్రు – రొయ్యూరు రోడ్డు పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేయనున్నారు. పవన్ చొరవతో ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న తాగునీటి సమస్య, రోడ్డు నిర్మాణం ఓ కొలిక్కి రావటంతో గుడివాడ, పెనమలూరు నియోజక వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జనసంద్రంగా మారిన గొడవర్రు..
అయితే పవన్ కళ్యాణ్ పర్యటనకు యువత పోటెత్తారు. భారీ కాన్వాయ్‌తో ఆయన గొడవర్రు గ్రామం వద్దకు రాగానే ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు, కూటమి నేతలు సైతం పెద్దపెట్టున ‘జై పవన్’ అంటూ నినాదాలు చేశారు. వారిని కట్టడి చేసేందుకు పోలీసులు సైతం శ్రమించాల్సి వచ్చింది. పర్యటన ముగిసే వరకు ఈ సందడి సాగింది. అధికారిక కార్యక్రమం అనంతరం పవన్ మంగళగిరికి బయలుదేరి వెళ్లారు. కాగా, గొడవర్రు వద్ద పవన్ కళ్యాణ్ ను చూసేందుకు వచ్చిన ఓ బాలిక ఆ రద్దీకి తాళలేక కాసేపు స్పృహ తప్పింది. కాగా, స్థానికులు వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స చేసి, బైక్ మీద వైద్యశాలకు తరలించారు. భయాందోళన వల్లనే ఆమె స్పృహ తప్పినట్లు వైద్యులు తెలిపారు.