AP Deputy CM Pawan Kalyan Released development of Pitapuram Work Reports: జనసేన అధినేత కొత్త ఏడాదిలో వినూత్న ప్రయత్నంతో ముందుకొచ్చారు. ఆరునెలల క్రితం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తాను.. అర్థ సంవత్సరంలో సొంత నియోజక వర్గానికి ఏం చేశాననే అంశాలను ‘సమగ్ర అభివృద్ధి నివేదిక-2024’పేరిట ట్వీట్టర్‌లో వెల్లడించారు. ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం నాలుగు స్తంభాలుగా ప్రజలు ఎన్నుకున్న మంచి ప్రభుత్వంలో తాను ఉండడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, పవన్ ప్రయత్నం పారదర్శతకు, జవాబుదారీతనానికి దారి చూపిందని ప్రజాప్రతినిధులు ప్రశంసిస్తున్నారు.
ప్రజలకు ప్రత్యేక సందేశం
ఈ సందర్భంగా పిఠాపురం నియోజక వర్గవాసులకు పవన్ ఒక లేఖ రూపంలో సందేశాన్ని అందించారు. ‘ప్రియమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, పలు పార్టీ నేతలకు, ఆడపడుచులకు, మిత్రులకు, వ్యాపార వేత్తలకు, ఉద్యోగులకు, వివిధ రంగాల ప్రముఖులకు, కార్మిక, కర్షక సోదరులకు, భావితరం భవిష్యత్తు విద్యార్ధులకు, పారిశుద్ధ్య కార్మికులకు, ముఖ్యంగా నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి జీవితాలలో సంతోషం నిండాలని, మీరంతా ఆరోగ్యంగా ఉండాలని మీ రంగాలలో బాగా రాణించాలని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యులు కాలవాని ఆకాంక్షిస్తున్నాను. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీ అమలుకు, రాష్ట్ర దశ, దిశా మార్చేలా అన్ని రంగాలలో ముందుకెళ్తూ, సంక్షేమాభివృద్ది సాదించేందుకు.. ప్రధాని గారి మార్గదర్శకత్వంలో, సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అహర్నిశలు కృషి చేస్తామని మాటిస్తున్నాము. అదే సమయంలో మీరూ మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించి రాష్ట్రాన్ని క్లీన్ అండ్ గ్రీన్ ఆంధ్రగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగస్వాములు కావాలని, తద్వారా మన ఏపీ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుందని నమ్ముతున్నాను.’
మీ ప్రేమకు దాసుడిని..
గత ఎన్నికల్లో ఎన్డీయే కూటమిపై పిఠాపురం ప్రజలు తనపై చూపిన ప్రేమను, నమ్మకాన్ని మరువలేనని అన్నారు. దశాబ్ద కాలపు తన పోరాటానికి ఫలితంగా ప్రజలు చరిత్రాత్మక విజయాన్ని అందించారని గుర్తుచేసుకున్నారు. ప్రజలు నాడు వర్గాలకు అతీతంగా పోలింగ్ బూతులకు తరలివచ్చి… ఒక్క గొంతుగా మారి రాష్ట్ర భవిష్యత్తు కొరకు, వ్యవస్థ ప్రక్షాళన కోసం నిలబడ్డారని ప్రశంసించారు. పిఠాపురం ఎమ్మెల్యేగా మీరు ఎన్నుకొన్న తర్వాత.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది. గ్రామీణ నీటి సరఫరా.. పర్యావరణ, అటవీ, సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా కొత్త బాధ్యతలు స్వీకరించానని, నాటి నుంచి త్రికరణ శుద్దిగా నా కర్తవ్యాలను నిర్వహిస్తున్నానని తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా ఆరున్నర నెలల కాలంలో జరిగిన కార్యక్రమాలు, అభివృద్ది పనుల వివరాలు, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు తెలియజెప్పటం తన బాధ్యతగా భావించి ఈ లేఖను రాస్తున్నట్లు తెలిపారు.
ఇదీ మా పనితనం
రూ. 2 కోట్ల వ్యయంతో పేదల కోసం టీటీడీ కళ్యాణ మండపం ఏర్పాటుకు మంజూరు
నియోజక వర్గం పరిధిలోని గొల్లప్రోలులో రూ. 72 లక్షలతో తాగునీటి సౌకర్యానికి శ్రీకారం
32 స్కూళ్లకు రూ. 16 లక్షల సీఎస్ఆర్ నిధులతో రూ. 25 వేల విలువైన రెండు క్రీడా కిట్ల పంపిణీ
పిఠాపురంలోని 30 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్
ఈ ఆసుపత్రిలో సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం రూ. 39.75 కోట్ల నిధుల మంజూరు
పిఠాపురం కాలేజీలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ల మరమ్మతు చేసి తాగునీరు అందించటం
గొల్లప్రోలు ప్రాథమికోన్నత పాఠశాలోని 449 విద్యార్థుల కోసం ఆర్వో ప్లాంటు
గొల్లప్రోలు డంపింగ్ యార్డ్ స్థలాన్ని కుదించి, ఆ మిగిలిన స్థలంలో రోడ్ల ఏర్పాటు
గొల్లప్రోలు పీహెచ్‌సీకి వెళ్లే పాడైపోయిన రోడ్డు స్థానంలో రూ. 4 లక్షలతో సీసీ రోడ్
గొల్లప్రోలు ఎంపీపీ పాఠశాలలో సీఎస్ఆర్ నిధులతో సౌకర్యాల కల్పన
చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్‌లో రూ. 2 లక్షలతో తాగునీటి సదుపాయం