Site icon Prime9

Chandrababu:వినూత్న ఆలోచనలతో సాగుదాం..తెలుగువారి మధ్య సహకారం పెరగాలి

AP CM Chandrababu speech in World Telugu Federation Conference: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా మారుతున్న కాలానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటుమహాసభలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీమతి ఇందిరా దత్, కృష్ణ ఎల్ల, మాజీ ఎంపీ మురళీమోహన్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి, కంభంపాటి రామ్మోహన రావు తదితరులు హాజరయ్యారు.

అదే లక్ష్యం కావాలి..
ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలో అనేక సాంకేతికతలు వస్తున్నాయని తెలుగువారంతా గుర్తించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.‘థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ లోకల్లీ’అనే ధోరణితో సాగితేనే తెలుగువారికి మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాలెడ్జ్‌ ఎకానమీలో తెలుగువాళ్లు మరింత ఉన్నతస్థితికి ఎదగాలని అన్నారు. ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఉంటూ గొప్ప విజయాలు సాధిస్తూ, ఈ సభకు వచ్చిన తెలుగు ప్రముఖులను చూస్తుంటే సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. తొలిసారి ఈ మహాసభలను నాటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించారని, నాటి నుంచి ఈ ప్రయాణం ఇంకా కొనసాగటం గొప్ప విషయమని అన్నారు. కాగా, అనంతపురం టూ ఆదిలాబాద్ వరకు ఎక్కడ ఉన్నా తెలుగు జాతి మనదేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

నాటి అంచనాలే.. నిజమయ్యాయి
ప్రపంచీకరణ అందించిన అవకాశాలను అందిపుచ్చుకుంటేనే భవిష్యత్తులో తెలుగువారు రాణించగలరనే నమ్మకంతో ఆనాడు రాళ్లు రప్పలున్న ఈ ప్రాంతంలో హైటెక్ సిటీ నిర్మాణం, ఐటీ రంగ సంస్థలకు ప్రోత్సాహాలు అందించామని దాని ఫలితంగా నేడు హైదరాబాద్ నాలెడ్జ్ హబ్‌గా మారిందన్నారు. చదువుకున్న వారంతా విదేశాలు పోతే.. మనకు నష్టమని ఆనాడు చాలామంది విమర్శించారని, కానీ…‘బ్రెయిన్ డ్రైయిన్ ఒక నాటికి బ్రెయిన్ గెయిన్ అవుతుందని ఆనాడే తాను చెప్పినట్లు గుర్తుచేశారు.

ఆలోచనే.. ఆదాయానికి మార్గం
వినూత్నంగా ఆలోచిస్తే తెలుగువాళ్లు మరింత రాణిస్తారన్నారు. ఏఐ, డీప్‌ టెక్నాలజీని తెలుగువాళ్లు అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ ఉండాలని చెప్పుకొచ్చారు. పెట్టుబడుల కంటే ఐడియాలు చాలా ముఖ్యమని తెలిపారు. చిన్న ఆలోచనతో వచ్చిన ర్యాపిడో వంటి స్టార్టప్‌లు గొప్ప విజయాలు సాధించాయన్నారు. కోవర్కింగ్‌ స్పేస్‌ ద్వారా వేలమందికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పారు. విద్య, ఉపాధితోనే పేదరికం పోతుందని అభిప్రాయపడ్డారు. సమాజంలో పేదలు, ధనికుల మధ్య అంతరం తగ్గాలని, లేకపోతే మనం సాధించిన అభివృద్ధి వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదన్నారు. జీరో పావర్టీ ప్రభుత్వాల లక్ష్యం కావాలని అభిప్రాయపడ్డారు.

టార్గెట్ 2047..
2047కు భారత్ ప్రపంచంలోనే మొదటి, రెండో స్థానంలో ఉండబోతోందని ఏపీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం విజన్ 2047 పేరిట.. స్వర్ణాంధ్ర ప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తోందని, కో వర్కింగ్ స్పేస్ ద్వారా ఏపీలో 5 వేల ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ సమయంలో 90 దేశాలకు వ్యాక్సిన్‌ అందించిన ఘనత తెలుగువారికి దక్కిందని, ప్రపంచ వ్యాప్తంగా గొప్ప విజయాలు సాధించే తెలుగువారందరినీ ప్రోత్సహించాలని, ఈ విషయంలో తెలుగు వారంతా ఒకరికి ఒకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాలలోని తెలుగువారి కంటే విదేశాల్లోని తెలుగువారే నేడు తమ భాష, సంప్రదాయాన్ని ఎక్కువగా గౌరవిస్తున్నారని ప్రశంసించారు.

జనాభా పెరగాలి..
దక్షిణ భారత దేశంలో జనాభా బాగా తగ్గుతోందని, కనుక జనాభా కనీస స్థాయిలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరముందని చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. డబుల్ ఇన్ కం.. నో కిడ్స్ అనే ఆలోచన మంచిది కాదని, ప్రతి కుటుంబంలోనూ పిల్లలుండటం అవసరమని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉద్యమంలో తెలుగువారంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

రెండోసారి హైదరాబాద్‌లో..
1993లో ఏర్పాటైన ప్రపంచ తెలుగు సమాఖ్య తొలి సమావేశం 1996లో హైదరాబాద్‌లో జరిగింది. నాటి నుంచి రెండేళ్లకోసారి మహాసభలను నిర్వహిస్తూ వస్తున్నారు. గతంలో విజయవాడ, విశాఖ పట్టణం, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, సింగపూర్, దుబాయ్, మలేసియాలోనూ ఈ సభలు జరిగాయని, ఇప్పుడు రెండోసారి మన హైదరాబాద్‌లో వీటిని నిర్వహిస్తున్నామని సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరాదత్ తెలిపారు. మూడవ రోజైన ఆదివారం జరిగే ముగింపు సభకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు.

Exit mobile version