AP Cabinet Key Decisions: ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రొహిబిషన్‌కు ఆమోదం పలికింది. ఏపీ ఎక్సైజ్ చట్టసవరణ ముసాయిదా, ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణ, 2014-18 మధ్య నీరు-చెట్టు పెండింగ్ బిల్లుల చెల్లింపు, పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధి పెంపు, పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ఆమోదం లభించింది. జ్యుడీషియల్ అధికారుల ఉద్యోగ విరమణ వయసు 61కి పెంచుతూ ఆమోదం తెలుపగా.. 2024 నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
కీలక నిర్ణయం..
ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 1982ని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ 2024 బిల్లుకి క్యాబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. కాగా పాత చట్టంతో భూ ఆక్రమణలపై కేసుల నమోదులో ఇబ్బందులు వస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం అందుతున్న 80 శాతం ఫిర్యాదుల్లో భూవివాదాలే ఉన్నాయంటున్న ప్రభుత్వం, వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు చెబుతోంది. ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయలుదేరారు.
నెలరోజుల్లో గాడిలో పెడతాం
పోలీస్ వ్యవస్థను నెలరోజుల్లో గాడిలో పెడదామని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. గత ప్రభుత్వం చేసిన నిర్వాకంతో పోలీసులు క్రమశిక్షణ తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రధానంగా వైసపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై చేస్తున్న ప్రచారంపై చర్చింారు. అసభ్యకరమైన ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత వద్దని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. అధికారుల తీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.