Site icon Prime9

AP Cabinet Decisions: ఏపీ అభివృద్ధికి 10 కీలక నిర్ణయాలు.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం

AP Cabinet Approves Key Decisions and Policies: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఈ మంత్రివర్గ సమావేశంలో 10 కీలక అంశాలపై లోతైన చర్చ జరిగింది. సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశం పలు పాలసీలకు ఆమోదం తెలిపింది. గృహనిర్మాణం, టెక్ట్స్‌టైల్, ఐటీ, మారిటైమ్, టూరిజం పాలసీలతో బాటు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న పలు అభివృద్ధి పనుల మీద కేబినెట్ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశపు వివరాలను కేబినెట్ భేటీ అనంతరం సమాచార మంత్రి కె. పార్థసారథి మీడియాకు వివరించారు.

గృహనిర్మాణంపై..
గిరిజన ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఐదేళ్లలో మంజూరై, ఇంకా నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేయటం, ఇప్పటికే ప్రారంభమైన ఇళ్లను పూర్తిచేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. పీఎం ఆవాస్ యోజన పథకం అర్బన్, రూరల్ కలిపి మొత్తం 9.31 లక్షల ఇళ్లు పూర్తిచేయాల్సి ఉందని, ఈ పథకంలో ప్రస్తావించిన తుది గడువైన డిసెంబరు 24ను కూటమి ప్రభుత్వం పొడిగించాలని విజ్ఞప్తి చేయగా, కేంద్రం ఈ గడువును మార్చి 26 వరకు పొడిగించారని మంత్రి తెలిపారు.

షిప్పింగ్‌లో వెనకబడ్డాం
ఏపీ మేరీటైం పాలసీని కూడా కేబినెట్ ఆమోదించింది. సుదీర్ఘమైన సముద్ర తీరం ఉన్న ఏపీలో మరిన్ని పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమలు అభివృద్ధి చేసి ఎగుమతులు, దిగుమతులకు హబ్ గా తీర్చిదిద్దాలని కేబినెట్ నిర్ణయించింది. గుజరాత్ పోర్టుల ద్వారా ఏటా 450 మిలియన్ టన్నుల ఎగుమతులు, దిగుమతులు చేస్తుండగా, మన రాష్ట్రంలో ఈ సామర్థ్యం కేవలం 180 మిలియన్ టన్నులుగానే ఉందని సీఎం ప్రస్తావించారు. ఏపీలో నౌకల తయారీ పరిశ్రమ ఏర్పాటుతో బాటు ఏపీకి ఒక మెగా షిప్‌యార్డు అవసరమని కేబినెట్ అభిప్రాయపడింది.

ఇంత నిర్లక్ష్యమా?
జల్‌జీవన్‌ మిషన్‌ పేరిట కేంద్రం ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని నిర్ణయించి, ఆయా రాష్ట్రాలకు నిధులు ఇస్తోందని దీనిని సమర్థమవంతగా ఏపీ ప్రభుత్వం వాడుకోలేకపోతోందని సమావేశం అభిప్రాయపడింది. దీనిపై.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ బ్యూరోక్రసీ కారణంగా ఈ పథకం డీపీఆర్ దశను దాటి ముందుకుపోలేకపోయిందని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల తాను ఢిల్లీలోని మంత్రులను కలిసినప్పుడూ.. అక్కడి అధికారులలో ఇదే అభిప్రాయం వ్యక్తమైందని ఆయన వెల్లడించారు. మిషన్ భగీరథ పేరుతో పక్క రాష్ట్రం దీనిని గతంలోనే సద్వినియోగం చేసుకుంటే.. గత ఐదేళ్ల పాలకుల నిర్లక్ష్యంతో మనం వెనకబడిపోయామని పేర్కొన్నారు. ఈ దశలో సీఎం జోక్యం చేసుకుంటూ.. అధికారుల్లో కమిట్మెంట్ పెరగాలని, సంబంధిత శాఖల అధిపతులు, మంత్రులు కూడా క్షేత్రస్థాయి పర్యటనలో ఈ పథకం అమలుపై ఆరా తీయాలని సూచించారు.

ఐటీలో ఏపీ మేటి కావాలి..
గ్లోబల్ కాంపిటీటివ్ సెంటర్స్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిని మెరుగపరచేందుకు, నిపుణుల సంఖ్యను పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని సమావేశంలో సీఎం వివరించారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు వ్యాపార రంగంలో ఉండాలనే ప్రభుత్వ ఆలోచనలో భాగంగా దీనిని తీసుకొచ్చామన్నారు. ఐటీ ఉద్యోగుల్లో చాలామంది పల్లెల్లో ఉంటూ వర్క్ ఫ్రం హోం చేస్తున్నారని, కానీ నేటికీ చాలా ప్రాంతాలలో అందుకు అనువైన సదుపాయాలు లేవని అందుకే కోవర్కింగ్ స్పేస్ డెవలప్ చేయాలన్నారు. ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు మందుకొచ్చే వారికి మొత్తం ఖర్చులో సగం సబ్సిడీతో బాటు వారు ఏర్పాటు చేసే సీటింగ్ కెపాసిటీని బట్టి నగరాల్లో ఒక్కో సీటుకు 2 వేలు, గ్రామాల్లో వెయ్యి చొప్పున ఇన్సెంటివ్‌గా అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి 50 శాతం కేపిటల్ సబ్సిడీ ఇవ్వాలని కూడా ఈ పాలసీలో ప్రస్తావించారు.

క్రీడల హబ్‌గా రాష్ట్రం…
మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో 2024-29 నూతన స్పోర్ట్స్ పాలసీకి ఆమోద ముద్ర పడింది. దీని ప్రకారం.. ఇకపై ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంచనున్నారు. ఏపీ నుంచి ఒలింపిక్స్‌, ఏషియన్‌ గేమ్స్‌‌లో విజేతలుగా నిలిచిన వారికి బంగారు పతకానికి ఇప్పుడున్న రూ.75 లక్షలను రూ.7 కోట్లకు పెంచారు. అలాగే, పీపీపీ విధానంలో క్రీడా ప్రాంగణాలు, శిక్షణా సంస్థలు, స్టేడియాలు నిర్మాణంపై ఫోకస్ పెంచాలని నిర్ణయించారు. ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’అనే నినాదంతో వచ్చిన ఈ పాలసీలో భాగంగా గ్రామీణ క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం లభించనుంది.

బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్.. ఏపీ
మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో సమీకృత పర్యాటక పాలసీ 2024-29ని కేబినెట్ ఆమోదించింది. దీని ప్రకారం రాష్ట్రంలో టూరిజం హోటళ్లలోని గదులను 3500 నుండి 10 వేలకు పెంచనున్నారు. పీపీపీ విధానంలో టూరిజానికి రూ.25000 కోట్ల పెట్టుబడులు ఆహ్వానిస్తారు. విశాఖ, అరకు, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి ప్రాంతాల్లో 7 యాంకర్ హబ్ ల ఏర్పాటు, అమరావతి – నాగార్జున కొండ, విశాఖపట్నం- తొట్లకొండ ప్రాంతాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్స్ ఏర్పాటు చేయనున్నారు. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు, శైవక్షేత్రాలను కలుపుతూ సర్క్యూట్‌ల ఏర్పాటు, వైజాగ్, కాకినాడ, శ్రీకాకుళం, నెల్లూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో 5 బీచ్ సర్క్యూట్‌లు, రివర్ టూరిజం సర్క్యూట్, 2 క్రూయిజ్ టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేస్తారు. శ్రీకాకుళం- విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి- గుంటూరు, కర్నూలు- నెల్లూరులలో ఎకో టూరిజం సర్క్యూట్‌లు రానున్నాయి.

నేతన్నలకు దన్నుగా పాలసీ
ఏపీ టెక్స్‌టైల్ అపరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 2024-29కి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ రంగంలో కనీసం రూ.10 వేల కోట్లు పెట్టుబడులు వచ్చేలా చూడాలని కేబినెట్ తీర్మానించింది. చేనేత కార్మికులకు, పద్మశాలీలకు ఈ పాలసీ వల్ల ఎంతో ఉపయుక్తం అవుతుంది. ఈ పాలసీలో రాయితీల కల్పన, రాష్ట్రంలో పీపీపీ మోడ్‌లో 5 టెక్స్‌టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో 10 వేల కోట్ల పెట్టుబడి, 6 లక్షల ఉద్యోగాల కల్పన, డ్వాక్రా గ్రూపులకు ఇందులో పెద్ద పీట వేయాలని ఈ పాలసీలో నిర్ణయించారు.

అమరజీవి ఆత్మత్యాగంపై..
తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలని నిరాహార దీక్షకు దిగిన పొట్టి శ్రీరాములు గారు అమరులైన డిసెంబరు 15వ తేదీని ఇకపై ఆత్మార్పణ సంస్మరణ దినంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఆయన జీవితానికి సంబంధించిన అంశాలపై సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించింది. అలాగే, శ్రీరాములు గారి నివాసాన్ని మ్యూజియంగా మార్చాలనే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.

ప్రోగ్రెస్ రిపోర్టు ఇవ్వండి
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తైనందున, ఏయే మంత్రులు ఎలా పనిచేశారు? ఏమేమి సాధించారు? ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? వంటి అంశాలపై మంత్రులు సెల్ఫ్‌ అసెస్మెంట్‌ ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. అంశాల వారిగా మొత్తం వర్క్‌‌షీట్‌ను డిసెంబర్‌ 12వ తేదీలోపు తన ముందుంచాలని సూచించారు. ఇలా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చే నివేదికతో బాటు గ్రౌండ్‌ రియాల్టీ తెలుసుకునేందుకు ఐవీఆర్‌ఎస్‌ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారులకే ఫోన్‌కాల్స్‌ చేసి.. పథకాల అమలు, సేవల్లో నాణ్యత.. తదితర అంశాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకోనున్నట్లు సీఎం తెలిపారు. పథకాల విషయంలో ప్రజలు మార్పుకోరుకుంటే అందుకు అనుగుణంగా నిర్ణయాలు మార్చుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అంతిమంగా ప్రజలే మనందరికీ బాస్‌లు అని సీఎం చెప్పారు.

సీఎం చిట్ చాట్
మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం వివిధ అంశాలపై మంత్రులతో చర్చించారు. గత వైసీపీ నేతల నిర్వాకంతో నేటికీ బియ్యం, భూ కబ్జాల గ్యాంగులు యాక్టివ్‌గానే ఉన్నాయని, వాటిని అరికడతామని స్పష్టం చేశారు. వైసీపీ ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను లాక్కోవటంలో కొత్త కల్చర్ తీసుకొచ్చిందని కామెంట్ చేశారు. కాకినాడ పోర్ట్ లాగేసుకుని 41 శాతం కేవీ రావుకు ఇచ్చేసి 59 శాతం అరబిందో వాళ్లు లాక్కొన్నారని, ఇలా ఆస్తులను లాగేసుకోవడం గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టులో తనకు ఎదురైన అనుభవాన్ని మరోసారి పవన్ ప్రస్తావించగా, ఇప్ప‌టికే వేసిన అయిదుగురు క‌మిటీ స‌భ్యుల నివేదిక వ‌చ్చిన త‌ర్వాత తదుప‌రి చ‌ర్య‌లు తీసుకుందామ‌ని చెప్పినట్లు తెలుస్తోంది.

అవీ.. ఇవీ
మంగళవారం నాటి కేబినెట్ సమావేశంలో ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్‌ రిజిస్ట్రేషన్‌ చట్ట సవరణకు ఆమోదం లభించింది. అలాగే, పులివెందుల, ఉద్దానం, డోన్‌ తాగునీటి ప్రాజెక్టులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. సోమవారం నాడు జరిగిన 41 వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 15 నుంచి అమ‌రావ‌తిలో ప‌నులు ప్రారంభించాల‌ని కూడా నిర్ణ‌యించింది.

అమరావతికి కోటి విరాళం
రాజధాని అమరావతికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే పలువురు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి విరాళాలు అందించ‌గా.. తాజాగా, కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన పి.విజయలక్ష్మి రూ.కోటి విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆయన ఈ మేరకు చెక్కును అందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మి దివంగతురాలైన తన తల్లి కోరిక మేరకు తమకున్న భూమిని అమ్మి ఈ విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పి.విజయలక్ష్మి త్యాగాన్ని ముఖ్యమంత్రి అభినందించారు.

వర్షాల కారణంగా వాయిదా
తుపాను, భారీ వర్షాల కారణంగా ఏపీలో ఈనెల 5న జరగాల్సిన సాగునీటి సంఘాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాయిదాపై కలెక్టర్లకు సమాచారం పంపారు. తదుపరి నోటిఫికేషన్ జారీ తేదీని త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల ఎన్నికలకు ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 6,149 సాగునీటి సంఘాలు , 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ను విడుదల చేసి ఓటరు జాబితాల రూపకల్పన, చేపట్టాల్సిన ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఫెయింజల్‌ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది.

Exit mobile version