Another earthquake hits Telangana at Mahaboobnagar: తెలంగాణలో మరోసారి భూకంపం సంభవించింది. మహబూబ్‌నగర్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.0గా నమోదైంది. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రంగా గుర్తించారు.
వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కౌకుంట్ల మండల పరిధిలోని దాసరిపల్లి కేంద్రంగా భూమి కంపించినట్లు గుర్తించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
మూడు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ భూకంపం చోటుచేసుకోవడం ఆందోళన కలిగించిందని అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు.