Actor Ajith Kumar : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో అజిత్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం ఆయన వయసు 84 సంవత్సరాలు. కాగా సుబ్రహ్మణ్యం మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నారు. అజిత్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, సుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు అజిత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
యూరప్ లో అజిత్ కుటుంబ సభ్యులు (Actor Ajith Kumar)..
సుబ్రమణ్యం కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మలయాళీ. ఆయన భార్య పేరు మోహినీ. ఈ దంపతులకు అజిత్ కుమార్‌తో పాటు అనుప్ కుమార్, అనిల్ కుమార్ అనే కుమారులు ఉన్నారు. కాగా అజిత్, ఆయన భార్య షాలిని, పిల్లలందరూ ప్రస్తుతం యూరప్ వేకేషన్‌లో ఉన్నారు. తన తండ్రి మరణ వార్త విని ఇప్పటికే చెన్నైకు పయనమైనట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం ఫ్యామిలీ టూర్ వెళ్ళిన వీరు.. తండ్రి మరణ వార్త తెలిసిన వెంటనే ఇండియాకు ప్రయాణం అయ్యారు. ఈ రోజు సాయంత్రం లోపు చేరుకోవచ్చని తెలుస్తోంది.
— Suresh Chandra (@SureshChandraa) March 24, 2023
కాగా ఈ రోజు సాయంత్రం చెన్నైలో బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో అజిత్ తండ్రి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. సుబ్రమణ్యం పక్షవాతంతో పాటు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇందుకోసం చికిత్స కూడా తీసుకుంటున్నాడు. అయితే శుక్రవారం తన ఇంట్లోనే ఆయన కన్నుమూశాడు. కాగా ముందు జాగ్రత్త చర్యగా సుబ్రమణ్యం ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.