World Economic Forum reports Women Empowerment: ఈనాటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అనేక రంగాల్లో దూసుకుపోతున్నారనేది కాదనలేని వాస్తవం. గతంలో భాష, సాహిత్యం, లలిత కళలు, సామాజిక శాస్త్రం, చరిత్ర వంటి సబ్జక్టులకే తమ ఆడపిల్లలను పరిమితం చేసే తల్లిదండ్రులు ఇప్పుడు అమ్మాయిలకు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన విద్యను అందించేందుకు ముందుకు రావటమూ సంతోషించాల్సిన విషయమే. ఈ సానుకూల పరిణామాలన్నీ మహిళా సాధికారతకు ఉదాహరణలుగా నిలుస్తుంటే.. నానాటికీ పెరిగిపోతున్న మహిళలపై పలు రూపాల్లో కొనసాగుతున్న హింస, రాజకీయాలలో వారికి తగిన భాగస్వామ్యం, కుటుంబంలో మహిళ నిర్ణయాలకు తగిన ప్రాధాన్యత, ఆస్తిలో సమాన హక్కు, వస్త్రధారణ, కుటుంబ సంప్రదాయాల పేరుతో వారి మీద ఉన్న ఒత్తిళ్ల విషయంలో మన సమాజం ఇంకా చొరవను ప్రదర్శించాల్సి ఉందనేది కాదనలేని వాస్తవం.
మనం తరచూ మహిళల విషయంలో వినే ‘సాధికారత’అనే మాటకు ఇప్పుడున్న నిర్వచనం మీదా పలు అభిప్రాయాలున్నాయి. మహిళలు వేరొకరి దయా దాక్షిణ్యాలు, అనుమతి మీద ఆధారపడకుండా, స్వతంత్రంగా ఇతరులతో సమాన స్థానాన్ని పొందటం, పరిమితులు, షరతులు లేని స్వేచ్ఛను అనుభవించటాన్ని ఇప్పుడు సాధికారత అంటున్నారు. కానీ, విద్య, వైద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యాపార, రాజకీయ రంగాల్లో పురుషులతో సమాన అవకాశాలను మహిళలు తమ తమ స్వీయ ప్రతిభతో, నిర్ణయ సామర్ధ్యంతో పొందగలిగితేనే దానిని సాధికారత అనాల్సి ఉంటుందనేది ఇప్పుడు బలంగా వినిపిస్తున్న అభిప్రాయం. నేడు కార్మిక రంగం నుంచి కార్పొరేట్ రంగం వరకు మహిళలు పలు రంగాల్లో రాణిస్తున్నారని చెబుతున్నారు గానీ వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే నేటికీ చాలా రంగాలలో వారిది నిర్ణయాత్మక పాత్ర కాదనే అర్థమవుతుంది.
మనదేశంలో మహిళా సాధికారత గురించి మాట్లాడే సందర్భాలలో చాలామంది పూర్వ ప్రధాని ఇందిరా గాంధీ వంటి పేర్లను ప్రస్తావిస్తుంటారు. అయితే ఆమె కుటుంబ నేపథ్యం, నాటి పరిస్థితులే ఆమెను గద్దెనెక్కేలా చేశాయి తప్ప ఒక స్వతంత్ర మహిళగా ఆమెకు వచ్చిన అవకాశంగా దానిని భావించటం కష్టం. తర్వాతి రోజుల్లో జయలలిత, మాయావతి వంటి మహిళా సీఎంలు కేంద్రంలోని విధానాలను కొంతమేరకు ప్రభావితం చేసిన మాట నిజమే అయినా, ఆ తర్వాతి కాలంలో అలాంటి నేతల సంఖ్య బాగా తగ్గుతూ వస్తోంది. నేడు దేశంలో 28 రాష్ట్రాలుండగా కేవలం బెంగాల్, ఢిల్లీలో మాత్రమే మహిళా సీఎంలున్నారు. వారిలో మమతను స్వయం ప్రకాశం గలిగిన నేతగా చెప్పొచ్చు గానీ, కేజ్రీవాల్ రాజీనామాతో సీఎంగా ప్రమాణం చేసిన అతిషిని ఆ లెక్కలో చూడలేము. నేటికీ రాష్ట్రానికి కేజ్రీవాలే సీఎం అనీ, తాను ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాననే మాటను అతిషి స్వయంగా పదేపదే చెప్పటమే దీనికి రుజువు. ఇక.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశంలో సీఎంలుగా బాధ్యతలు నిర్వహించిన మహిళల సంఖ్య కేవలం 17 మాత్రమే. ఇలా.. లోతుగా పరిశీలిస్తే ప్రతి రంగంలోనూ పరిస్థితి ఇదే తీరుగా ఉంది.
మన దేశంలో మహిళా సాధికారతకు ప్రధాన అవరోధంగా మన సామాజిక పరిస్థితులున్నాయనేది కొట్టిపారేయలేని మరో వాస్తవం. ఇంట్లోని బోలెడంత చాకిరి, పిల్లల పెంపకం మొదలు చివరికి ఇంటి పరువు వరకు ప్రధాన బాధ్యత మహిళలదే. అమ్మాయిలు తల్లిదండ్రుల వద్ద కులాంతర, మతాంతర వివాహాల ప్రతిపాదన చేసినా, కెరీర్ కోసం అసలు వివాహమే వద్దన్నా కూడా అది ఆ కుటుంబానికి పరువు సమస్యగా మారటం విషాదం. అయితే, పట్టణ, నగర ప్రాంతాల్లోని విద్యను అందిపుచ్చుకున్న కుటుంబాలలో ఈ పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, గ్రామాలలో ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. ఇక.. అమ్మాయి ఎంత చదివితే అంతకంటే ఎక్కువ చదివిన భర్తను తీసుకురావాలనే భావన విషయంలో గ్రామీణ ప్రాంత శ్రామిక వర్గాలలో ఇంకా బలంగా నిలిచే ఉంది.
ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) 2023 నాటి నివేదికలో లింగ సమానత్వ సూచీలో 146 దేశాల గురించి ప్రస్తావించగా, అందులో మన దేశం 0.643 స్కోర్‌తో 127వ స్థానంలో నిలిచింది. 2022లో మనం 119వ స్థానంలో నిలిచాం. ఈ సూచీలో ఐస్‌లాండ్ వరుసగా 14 సార్లు తొలిస్థానంలో నిలవగా, మనకంటే పేద దేశమైన బంగ్లాదేశ్ 59వ స్థానంలో నిలిచింది. 2021 నాటికి మనదేశంలో స్త్రీల అక్షరాస్యత రేటు 70.3% కాగా, పురుషుల అక్షరాస్యత రేటు 84.7%గా ఉంది. ఈ విషయంలో తైవాన్ 99.99% అక్షరాస్యత రేటుతో ముందంజలో ఉండగా, 99.98%తో ఎస్టోనియా, మూడవ స్థానంలో ఇటలీ ఉన్నాయి. ఇక మనదేశంలో ఏటా దాదాపు 50 లక్షల మంది బాలికలు, యువతులు వ్యభిచార కూపంలోకి బలవంతంగా లాగబడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ప్రతీ ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక హింసకు గురవుతోండగా, ప్రతి 34 నిమిషాలకు ఒక అత్యాచారం, ప్రతి 43 నిముషాలకు ఒక లైంగిక వేధింపు జరుగుతోంది. ప్రతి 93 నిముషాలకు ఒక స్త్రీ వరకట్నానికి బలవుతోంది. అత్యాచారానికి గురవుతున్న మహిళల్లో 25 శాతం మంది 16 ఏళ్లలోపు బాలబాలికలే కావటం విషాదం. మనదేశంలో నేటికీ అర్బన్ ప్రాంతాల్లో ఇళ్లలో పనిమనుషులుగా, పారిశుధ్య కార్మికులుగా, మాల్స్, ఆఫీసుల్లో హౌస్ కీపింగ్ స్టాఫ్‌గా, నిర్మాణరంగంలో కూలీలుగా మహిళలే ఎక్కువగా ఉన్నారు. రైతు కూలీలలో వీరి వాటా 57శాతంగా ఉండగా, సాగు, కుటీర పరిశ్రమలు, డొమిస్టిక్ శ్రమలో వారి వాటా 74%గా ఉంది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే, పనిచేసే ఈ మహిళల్లో నేటికీ సగం కంటే ఎక్కువ మందికి తమ సంపాదన మీద పూర్తి హక్కు లేదనేది అంగీకరించాల్సిన చేదు వాస్తవం.
మహిళాభివృద్ధి కోసం అర్థవంతమైన పెట్టుబడులు పెట్టాలని ఐక్యరాజ్యసమితి ఏనాటి నుంచో చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది తక్షణావసరమనేది సమితి భావన. చట్టపరమైన రక్షణలు పెంచుతూ, మహిళాభ్యుదయం మీద స్థానిక ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ప్రగతి పరుగులెత్తుతుందని, ముఖ్యంగా మహిళలకు నేరుగా ఆర్థిక సాయం అందించే పథకాలు అమలు చేయగలితే మరీ మంచిదని సమితి చెబుతోంది. అలాగే, పాలక వ్యవస్థలలో మహిళా భాగస్వామ్యం పెరగాలనేది సమితి చెబుతున్న మరో ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో.. ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌లోని రాజకీయ పక్షాలు సమితి మాటను అమల్లోకి తీసుకురావాల్సి ఉంది. ముఖ్యంగా 2029 తర్వాత మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి గనుక పార్లమెంటు మొదలు ప్రతి స్థాయిలోనూ 33% మహిళల రాజకీయ భాగస్వామ్యం అనివార్యం కానుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పక్షాలు ఇప్పటినుంచే తమ తమ పార్టీలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి, వారిని సమర్థులైన భవిష్యత్ నేతలుగా మలిచేందుకు నడుం బిగించాల్సి ఉంది. ఆ దిశగా పార్టీలు అడుగులు వేయాలంటే, ఇప్పటి నుంచే దీనిపై దేశవ్యాప్తంగా ఒక బలమైన చర్చ జరగాల్సిన అవసరముంది. మన తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ముందుగా.. దీనిపై ఒక విధాన పరమైన ప్రకటన చేయగలిగితే.. అది మరింత బాగుంటుంది.