China Debts: చైనా ప్రపంచంలోని పలు పేద దేశాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి వాటిని తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. ప్రస్తుతం చైనా రుణాలు ఇచ్చిన సుమారు డజనుకు పైగా దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. డిఫాల్ట్ కావడానికి సిద్దంగా ఉన్నాయి. చైనా నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న శ్రీలంక, పాకిస్తాన్, కెన్యా, జాంబియాలతో సుమారు డజను దేశాలు ప్రస్తుతం ఆర్థిక అస్థిరతతో ఉక్కరి బిక్కిరి అవుతున్నాయి. చైనా నుంచి రుణాలు తీసుకున్న ఈ దేశాలు తిరిగి చెల్లించలేక ఏ క్షణంలోనైనా కుప్పకూలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చైనా రుణాలపై అసిసియేటెడ్ ప్రెస్ పరిశోధన జరిపి ఒక నివేదికను తయారు చేసింది. పాకిస్తాన్, కెన్యా, జాంబియా, లావోస్, మంగోలియా లాంటి దేశాలు చైనా నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో డిఫాల్ట్ దశలో ఉన్నాయి. ఈ దేశాలకు పన్నుల రూపంలో వచ్చే రెవెన్యూలో స్కూళ్లు, విద్యుత్, ఆహారం, ఇంధనం కోసం వ్యయం చేయడంలోనే పరిపోతోంది. ఈ దేశాల వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం రుణాలపై వడ్డీ చెల్లించడానికి సరిపోతోంది. కొన్ని దేశాల వద్ద విదేశీ మారకద్రవ్యం పూర్తిగా కరిగిపోయింది.
వడ్డీ చెల్లింపులో వెసులుబాటు లేకుండా..(China Debts)
ఇవన్నీ ఒక ఎత్తయితే చైనా మాత్రం ఇచ్చిన రుణాన్ని ముక్కు పిండి వసూలు చేస్తోంది. వడ్డీరేటు తగ్గించడంతో పాటు వడ్డీ చెల్లింపులో వెసులుబాటు ఇవ్వడానికి కూడా ససేమిరా అంటోంది. అదీ కాకుండా చైనా ఎంత రుణం ఇచ్చింది అనేది కూడా అత్యంత రహస్యంగా ఉంచుతుంది. దీనికి సంబంధించిన షరతులు కూడా మూడో కంటికి కనిపించకుండా.. వినిపించకుండా జాగ్రత్త పడుతుంటోంది. ఈ రహస్యం ఎందుకంటే ఫలానా దేశానికి చైనా ఇంత మొత్తం రుణం ఇచ్చిందని తెలిసిస్తే .. ప్రపంచంలోని ఇతర బ్యాంకులు వచ్చి ఆదుకుంటాయని చైనాకు భయం. ఇవన్నీ ఒక ఎత్తయితే చైనా నుంచి రుణాలు తీసుకున్నా వారు తమ చెల్లింపులను నగదు రూపంలో మూడో కంటికి కనిపించకుండా ఎస్ర్కో అకౌంట్‌లో జమ చేయమని బలవంతంగా చేస్తోంది. అటు నుంచి చైనా ఆ డబ్బును విత్‌డ్రా చేసుకుంటోంది.
రుణాలు చెల్లించలేక డిఫాల్ట్ ..
సుమారు డజనుకు పైగా పేద దేశాలు 50 శాతం రుణాలను చైనా నుంచే తీసుకున్నాయి. ఈ దేశాల ప్రభుత్వాలు తమ రెవెన్యూలో మూడో వంతు విదేశీ రుణాలు చెల్లించడానికి సరిపోతోంది. జాంబియా, శ్రీలంకలు ఇప్పటికే డిఫాల్డ్ అయ్యాయి. చైనా నుంచి రుణాలు తీసుకుని పోర్టులు, మైన్లు, పవర్ ప్లాంట్‌లపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం రుణలపై వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో ఈ రెండు దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి.
పాకిస్తాన్ విషయానికి వస్తే లక్షలాది టెక్స్‌టైల్స్ వర్కర్స్ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పాకిస్తాన్ కూడా చైనా నుంచి భారీ ఎత్తున అప్పులు తీసుకుంది. ప్రస్తుతం పాక్ పరిస్థితి ఎలా ఉందంటే టెక్స్‌టైల్స్‌మిల్స్‌కు విద్యుత్ సరఫరా చేయలేని పరిస్థితిలో ఉంది. దీంతో మిల్లు మూతపడ్డాయి. కార్మికులు రోడ్డున పడ్డారు. కెన్యా ప్రభుత్వం ఉద్యోగులకు వేతానలు నిలిపివేసింది. విదేశీ మారకద్రవ్యం ఆదా చేసుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాలు త్యాగాలుచేయాలని దేశాధ్యక్షుడి ఆర్థిక సలహాదారుడు కోరారు. ఆయన ట్విట్టర్ లో వేతనాలు కావాలా.. లేదా డిఫాల్ట్ అవుదామా మీరే నిర్ణయించండి అంటూ చాయిస్ ఈజ్ యువర్స్ అంటూ ఉద్యోగులకే ఆప్షన్ ఇచ్చారు. ఏడాది క్రితం శ్రీలంక డిఫాల్ట్ అయ్యింది. దీంతో సుమారు ఐదు లక్షల మంది పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారు. ద్రవ్యోల్బణం 50 శాతానికి చేరింది. దేశంలోని జనాభాలో 50 శాతం పేదరికంలోకి జారీ పోయారు.
జాంబియా చుట్టూ చైనా ఉచ్చు..
ఇక చైనా రుణాలు ఇచ్చి ఎలా ఇరికిస్తుందో అసోసియేడ్ ప్రెస్ పరిశోధన చేసింది. ఉదాహరణకు సువిశాలమైన భూభాగం ఉన్న జాంబియాను తీసుకుంటే ఇక్కడ జనాభా 20 మిలియన్‌లు అంటే రెండు కోట్ల జనాభా ఉంటుంది. గత రెండు దశాబ్దాల నుంచి చైనాకు ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకుల నుంచి బిలియన్‌ల కొద్ది డాలర్లను రుణాలుగా తెచ్చుకుని డ్యామ్‌లు, రైల్వేలు, రోడ్లు నిర్మించుకుంది. రుణాలు తెచ్చుకుని ఆర్థికంగా జాంబియా బలోపేతం అయ్యింది. అయితే విదేశీ బ్యాంకులు వడ్డీరేట్లు భారీగా పెంచడంతో ప్రభుత్వం ప్రజలకు హెల్త్‌కేర్, సోషల్ సర్వీసెస్‌తో పాటు రైతులకు విత్తనాలు, ఎరువులపై సబ్సిడీ ఎత్తివేయాల్సి వచ్చింది. ఇక జాంబియా వద్ద ఉన్న కొద్ది పాటి అమెరికన్ డాలర్లను ఆదా చేసుకుందామని చైనాను వడ్డీరేటును కొంత తగ్గించాలని బతిమాలినా.. ససేమిరా అంది. దీంతో జాంబియా వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్యం పూర్తిగా కరిగిపోయింది. కాగా ఉన్నపాటి డాలర్లతో చమురు దిగుమతి చేసుకొనేందుకు వినియోగించుకునేది. నిల్వలు పూర్తిగా కరిగిపోయాక నవంబర్ 2022లో జాంబియా డిఫాల్ట్ అయ్యింది. ప్రభుత్వం ఖర్చులు తగ్గించుకుంది. ప్రజలు పేదరికంలోకి జారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారీ అప్పుల్లో కూరుకుపోయిన దేశాల్లో ద్రవ్యోల్బణం చూస్తే దాదాపు 50 శాతంపైనే ఉంటోంది. జాంబియాలో ద్రవ్యోల్బణం 50 శాతంపైనే ఉంది. నిరుద్యోగం 17 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. దేశీయ కరెన్సీ క్వాచా విలువ ఏడు నెలల్లో 30 శాతం క్షీణించింది. 3.5 మిలియన్ జనాభా కలిగినదేశంలో మూడోవంతు పేదరికంలో మగ్గాల్సి వచ్చింది. చైనా బ్యాంకులకు జాంబియా 6.6 బిలియన్ డాలర్లు బకాయి పడినట్లు పరిశోధనలో తేలింది.
పేద దేశాలు చైనా నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మరో పక్క చైనా వడ్డీ మాఫీ చేయడానికి ససేమిరా అంటోంది. ఇక అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) విషయానికి వస్తే తక్కువ వడ్డీరేటుకు రుణం ఇవ్వడానికి ససేమిరా అంటున్నాయి. చాద్, ఇథియోపియా విషయానికి వస్తే ఏడాది నుంచి ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నాయి.