US Republican-led House passes immigrant detention bill: గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను చెప్పినట్లుగానే కొత్తగా అధికారంలోకి వచ్చిన ట్రంప్ సాగిపోతున్నారు. ఈ క్రమంలో బుధవారం అక్రమ వలసల నిర్బంధం, బహిష్కరణే లక్షంగా ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చిన కీలక బిల్లుకు తాజాగా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అయితే ఈ బిల్లు అమలుకు నిధులు సరిపోవని, కనుక ఈ బిల్లు అనుకున్నంత వేగంగా అమల్లోకి రాకపోవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బిల్లుకు డెమెక్రాట్ల మద్దతు..!
చోరీలు, దోపీడీలు, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేలా రూపొందించిన ఈ బిల్లుకు అమెరికన్ కాంగ్రెస్‌లోని మొత్తం 263 మంది సభ్యుల్లో 156 మంది మద్దతు తెలిపారు. వీరిలో 46 మంది డెమొక్రాట్లు ఉండటం చెప్పుకోదగ్గ అంశం. కాగా, అలబామా సెనేటర్, రిపబ్లికన్ నేత కేటీ బ్రిట్ మాట్లాడారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ ఆమోదించిన అత్యంత కీలకమైన ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బిల్లు ఇదేనని వ్యాఖ్యానించారు.
టెంట్లు రెడీ చేసిన మెక్సికో
అక్రమ వలసదారులను బయటకు పంపుతాననే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో మెక్సికో అప్రమత్తం అయింది. సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. అమెరికా దేశంలోని టెక్సాస్ ఎల్ పాసో సరిహద్దు సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో అధిక సంఖ్యలో శిబిరాలను నిర్మిస్తోంది. బహిష్కరణకు గురైన వారికి ఈ శిబిరాల్లో తాత్కాలిక ఆశ్రయం కల్పిస్తామని మెక్సికో అధికారులు తెలిపారు. వలసదారులు సంఖ్యకు తగినట్లు అవసరమైతే మరిన్ని శిబిరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే అమెరికాకు ఇతర దేశాల నుంచి వలస వచ్చి బహిష్కరణకు గురైన వారిని మెక్సికన్ నగరానికి తరలించాలని సూచించారు.
బలగాల మోహరింపు
అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నిఘాను పెంచడం కోసం 1500 క్రియాశీలక బలగాలను మోహరిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఇప్పటికే 5వేల మందికి పైగా వలసదారులను నిర్బంధించినట్లు, వారిని దేశం నుంచి పంపించే విషయంలో హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌కు తాము మద్దతుగా ఉంటామని వెల్లడించింది. అక్రమ వలసదారుల బహిష్కరణ కోసం తాము సైనిక విమానాలను పంపిస్తామని తాత్కాలిక రక్షణ కార్యదర్శి రాబర్ట్ సాలెస్సెస్ పేర్కొన్నారు.