Site icon Prime9

UNSC: భద్రతా మండలిలో భారత్‌కు చోటుదక్కేనా?

United Nations Security Council: ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల కోసం అమెరికా నుంచి అతి చిన్న దేశం వరకూ దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఎలాంటి ఫలితాలనూ ఇవ్వటం లేదనే వాదన మరోసారి చర్చగా మారుతోంది. దాదాపు 80 ఏళ్ల క్రితం ఏర్పడిన ఐక్యరాజ్య సమితిలో నాడు భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా ఉండాలని చైనా, ఫ్రాన్స్‌, రష్యన్‌ ఫెడరేషన్‌, బ్రిటన్‌, అమెరికా దేశాలు వాటికవే నిర్ణయించుకున్నాయి. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా 50 స్వతంత్ర దేశాలు మాత్రమే ఉండేవి. కానీ, ఈ ఎనిమిది దశాబ్దాల కాలంలో ఈ దేశాల సంఖ్య 193కు పెరిగాయి. ఇన్నేళ్లలో భద్రతా మండలిని ఒకే ఒక్కసారి 1965లో విస్తరించగా, దాంతో మండలి సభ్యదేశాల సంఖ్య 15కు చేరింది. ఇందులో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లు ఉండగా, మిగతా 10 తాత్కాలిక సభ్య దేశాలు రొటేషన్‌ పద్ధతిపై మారుతుంటాయి. అయితే, నేటికీ ఈ ఐదు దేశాలే సమితి మీద తమ పెత్తనాన్ని సాగిస్తూనే వస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చి ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా సంస్కరణలు అమలు చేయాలని భారత్‌తో సహా పలు దేశాలు పదేపదే కోరుతున్నా, ఈ దేశాలు వినీవిననట్లు ఊరుకుంటున్నాయి తప్ప స్పష్టమైన నిర్ణయాలు ప్రకటించటం లేదు. దీంతో సమితి పేరుకు మాత్రమే పెద్దగా మిగిలి, ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న సంక్షోభాలకు అడ్డుకట్ట వేయలేకపోతోంది.

మరోవైపు.. ఐరాస భద్రతా మండలిలో కొత్తగా శాశ్వత సభ్యత్వం పొందే దేశాలకూ వీటో అధికారం ఉండాలని భారత్‌ గట్టిగా చెబుతోంది. దీనివల్ల పూర్వ శాశ్వత సభ్య దేశాలైన చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ దేశాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి వీలుండదని, తద్వారా మండలికి అంతర్జాతీయంగా మరింత విశ్వసనీయత పెరుగుతుందని భారత్ చెబుతూవస్తోంది. కొత్త, పాత శాశ్వత సభ్యదేశాలు వీటో అధికారాన్ని బాధ్యతగా, సామూహిక జనహననం, యుద్ధ నేరాల వంటి అంశాలకే వీటో పవర్‌ను పరిమితం చేయాలనేది భారత్ వాదన. అలాగే, ఐరాస జనరల్‌ అసెంబ్లీకి భద్రతా మండలి మరింత జవాబుదారీగా ఉండాలని కూడా భారత్‌ అభిప్రాయపడుతోంది. ముఖ్యంగా ఉగ్రవాద నిరోధం వంటి ప్రధాన అంతర్జాతీయ సమస్యలపై భద్రతా మండలి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోకుండా కొన్ని శాశ్వత సభ్య దేశాలు వీటో అధికారాన్ని దుర్వినియోగం చేయటం సరికాదని, ఈ పరిస్థితి మారాలంటే భద్రతా మండలిని విస్తరించాలని మనదేశం పదేపదే మొత్తుకుంటోంది.

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద జనశక్తిగా, మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచపు మూడవ అతిపెద్ద సైనిక శక్తిగా నిలుస్తోన్న భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే ప్రతిపాదనకు గత దశాబ్దకాలంగా ప్రపంచవ్యాప్తంగా విస్తృత మద్దతు లభిస్తోంది. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా, పశ్చిమాసియా, మధ్యాసియా, ఆసియాన్‌ దేశాలు ఈ విషయంలో భారత్‌ను బలపరుస్తున్నాయి. ఐరోపా దేశాలూ మద్దతిస్తున్నాయి. ఇలా ధనిక, వర్ధమాన దేశాలు రెండింటి నుంచీ భారత్‌ మద్దతు పొందుతోంది. గతంలో జీ20 సభలో ఆస్ట్రేలియా, పోర్చుగల్‌ దేశాలు భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వం పొందడానికి అన్నివిధాలా అర్హురాలని ప్రకటించాయి. గతంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఫ్రాన్స్‌, బ్రిటన్‌, ఆఫ్రికన్‌ యూనియన్‌, చివరకు టర్కీ కూడా భారత్ ప్రతిపాదించిన భద్రతా మండలి సంస్కరణలకు మద్దతు ప్రకటించాయి. అయితే, ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవటమే పనిగా పెట్టుకున్న ఏకైక దేశంగా చైనా నిలుస్తోంది.

ఆసియాలో భారత్‌ తనకు పోటీదారుగా ఉందని భావిస్తున్న చైనా భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆసియాలోని చిన్న దేశాలకు అప్పులు ఇస్తూ, వాటిని తన తొత్తులుగా మార్చుకుంటోంది. పనిలో పనిగా అప్పులు చెల్లించని దేశాల భౌగోళిక ,ప్రాదేశిక హక్కులను కైవశం చేసుకుంటూ సాగుతోంది. దీనిని గమనించిన భారత్.. ఆ దేశాలు స్వశక్తిపై ఆధారపడేందుకు వీలుగా చేస్తున్న సాయం మీద చైనా గుర్రుగా ఉంది. అందుకే భద్రతామండలిలో భారత్‌కి స్థానం గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ, ఆ దేశం.. పాకిస్థాన్‌ను ఉసిగొల్పుతోంది. భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తే తమకు ప్రమాదమంటూ పాక్ ప్రతిసారీ పాతపాట పాడుతూనే వస్తోంది. ఇందుకు ప్రతిఫలంగా, పాక్‌ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాదులపై సమితి గట్టి చర్యలు తీసుకోకుండా చైనా తన వీటో పవర్‌తో అడ్డుపడుతూ వస్తోంది. ఈ విషయాలన్ని అమెరికాకి తెలిసినా ఆ దేశం.. ఈ అంశంపై ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోంది. ఓ వైపు భారత్ తమ మిత్ర దేశం అంటూనే పరోక్షంగా పాక్‌ మీద నిర్దిష్టమైన సైనిక, దౌత్య, ఆర్థిక ఆంక్షలు విధించకుండా నాటకమాడుతోంది. అటు.. రష్యాకూడా పలు సందర్భాల్లో భారత్‌కు భద్రతా మండలిలో స్థానం కల్పించాల్సిందేనని చెబుతున్నా.. దౌత్య పరంగా చైనాతో గల సంబంధాల మూలంగా మన దేశం తరఫున గట్టిగా గళం విప్పలేకపోతోంది.

సమితిలో సంస్కరణలు జరగకపోవటం వల్ల అనేక దేశాలు దీర్ఘకాలంగా పేదరికంలో కునారిల్లుతూనే ఉండిపోతున్నాయి. ప్రపంచబ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి సంస్థలు తమ నిధులను పేద దేశాల ప్రగతికి మళ్లించకుండా వీటో పవర్ ఉన్న దేశాలు అడ్డుకుని, వాటిని తమకు అనుకూలంగా ఉండే దేశాలకు మళ్లించుకుంటున్నాయి. అదే సమయంలో పేద దేశాలకు అప్పులిచ్చి వాటి వనరులను కొల్లగొడుతున్నాయి. పేద, అభివృద్ధి దేశాల మార్కెట్ల నిండా తమ ఉత్పత్తులను కుమ్మరిస్తూ ఆ దేశాలు స్వశక్తితో ఎదగకుండా మోకాలడ్డుతున్నాయి. అలాగే, టెక్నాలజీ, మేధో సంపత్తిపై తమ ఏకఛత్రాధిపత్యాన్ని తొలగించకుండా అక్కడి వ్యవస్థలను నియంత్రిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి లక్ష్యాలు నెరవేరాలంటే.. సమితిలో సంస్కరణలు అత్యంత అవసరం. ఆ సంస్కరణ.. భారత్‌కు శాశ్వత సభ్యదేశంగా అవకాశం కల్పించటం ద్వారానే మొదలు కావాలని వర్థమాన ప్రపంచం ఆకాంక్షిస్తోంది.

Exit mobile version