Site icon Prime9

Ukraine-Russia War: మూడేళ్ల సుదీర్ఘ యుద్ధం ఇకనైనా ముగిసేనా?

When Will Ukraine-Russia War End: కొత్త ఏడాదిలో ప్రపంచాన్ని కలవరపెడుతున్న సమస్యల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఒకటి. ఈ శతాబ్దపు సుదీర్ఘ యుద్ధంగా పేరొందిన ఈ పోరు మరో నెల రోజుల్లో మూడో ఏడాదికి చేరనుంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దళాలు చేపట్టిన సైనిక చర్య నిరాటంకంగా కొనసాగుతుండటంతో ఉక్రెయిన్‌ దేశం దాదాపుగా సర్వనాశనమైంది. ఆత్మరక్షణ కోసం ఉక్రెయిన్ తన శక్తిమేర ప్రతిఘటిస్తున్నా.. అది సింహం ముందు చిట్టెలుక పోరులా మిగిలిపోయింది. ఈ పోరు మూలంగా ఇప్పటివరకు 12 వేల మంది ఉక్రెయిన్‌ పౌరులు యుద్ధంలో మృతి చెందగా, మరో 40 వేల మంది గాయపడినట్లు తెలుస్తోంది. దేశంలో ఐదో వంతు భాగాన్ని(గ్రీస్ దేశంతో సమానమైన భూభాగం) రష్యా ఆక్రమించుకోవటంతో లెక్కకు రాని మరణాలు, నష్టాలూ ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉండొచ్చని ఉక్రెయిన్‌ చెబుతోంది. ఈ ఏడాది గత నవంబరు నాటికి 600 మంది ఉక్రెయిన్‌ చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని, యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో జననాల రేటు దారుణంగా తగ్గిపోయిందని యూనిసెఫ్ అంచనా వేసింది. సుమారు 4.4 కోట్ల జనాభా ఉన్న ఉక్రెయిన్‌లో 60 లక్షల మంది పౌరులు ఉన్న తావు నుంచి వేరే ప్రాంతాలకు తరలిపోగా, 1.2 కోట్ల మంది ఉక్రెయిన్‌ పౌరులు ప్రాణభయంతో దేశాన్ని వీడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 88వేల మంది ఉక్రెయిన్ సైనికులు ఈ పోరులో ప్రాణాలు కోల్పోగా, దాదాపు 4 లక్షల మంది సైనికులు గాయపడ్డారు. రష్యా కూడా భారీగానే తన బలగాలను కోల్పోయిందని అంచనా. పశ్చిమదేశాల నిఘా ప్రకారం దాదాపు 2 లక్షల మంది రష్యా సైనికులు ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోగా, మరో 4 లక్షల మంది గాయపడినట్లు సమాచారం. ఇక ఉక్రెయిన్‌ జనాభాలో 1.2 కోట్ల మంది తగ్గారు. ఈ సుదీర్ఘ సంఘర్షణ కారణంగా 2024 డిసెంబరు నాటికి ఉక్రెయిన్‌ 152 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. ఆ దేశంలో హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, విద్యుత్‌, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రపంచ బ్యాంకు, ఐరాస అంచనా వేశాయి. యుద్ధం వల్ల పలు ఉక్రెయిన్‌ నగరాలు నామరూపాలు లేకుండా పోయాయి. ఒకరోజు యుద్ధానికి ఉక్రెయిన్‌ 140 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టాల్సి రావటంతో ఆర్థికంగా దేశ ఆర్థిక వ్యవస్థ 60 శాతానికి పైగా నష్టపోయింది. ప్రభుత్వానికి వచ్చే పన్నులు బాగా తగ్గిపోవటం, ఖజానాలో ఎక్కువ భాగం నిత్యావసరాల కోసమే మళ్లించాల్సి రావటంతో విదేశాల సాయంపైనే ఆధారపడాల్సి వస్తోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆ రెండు దేశాలనే గాక మిగతా ప్రపంచానికీ చెమటలు పట్టిస్తోంది. దీని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 14 కోట్ల మంది పేదరికంలోకి జారిపోయారని ఒక తాజా అధ్యయనంలో తేలింది. మూడేళ్ల యుద్ధంతో పలు దేశాల్లో ఇంధన, విద్యుత్తు ధరలు రెట్టింపయ్యాయి. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా సహా 116 దేశాల్లో ధరల పెరుగుదల ప్రభావం కనిపిస్తోంది. 2030 వరకు ఈ పెరిగిన ధరలు సాధారణ స్థితికి వచ్చే సూచనలే లేవు. యుద్ధానికి ముందు ఐరోపా వాడే సహజవాయువులో సగం రష్యాయే ఎగుమతి చేసేది. అమెరికా తర్వాత అంతగా సహజ వాయువును ఉత్పత్తి చేసే రెండో అతి పెద్ద దేశమూ రష్యాయే. అయితే, యుద్ధం వలన రష్యాపై ఐరోపా దేశాలు ఆంక్షలు విధించటం, ఈ క్రమంలో పలు దేశాలు రష్యా గ్యాస్ కొనటం ఆపటం లేదా తగ్గించటం చేశాయి. దీంతో గ్యాస్ ఉత్పత్తి తగ్గిపోవటం, ఆపై గ్యాస్ వనరులున్న ఇతర దేశాలు సహజవాయువు ధరను పెంచటంతో పలు రంగాలు కుదేలవుతున్నాయి. యుద్ధం మూలంగా చమురు, బొగ్గు, గ్యాస్ ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొననుందని, పలు పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన బిల్లులు తడిసి మోపెడవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్ జగడం ఆహార సరఫరా మీదా తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి ఉక్రెయిన్ నుంచి ఆహారోత్పత్తులు అందుతుండగా, ఇప్పుడు దానికి బ్రేక్ పడింది. యుద్దం వల్ల ఉక్రెయిన్‌లో 30% సాగుభూములు ఈ మూడేళ్లుగా బీడుపడ్డాయి. ఉన్న సాగుకూ విత్తనాలు, ఎరువులు సరిగా అందటం లేదు. రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచే ప్రపంచానికి అవసరమయ్యే గోధుమలలో నాలుగోవంతును సరఫరా చేసేవి. యుద్ధం వల్ల ఆ ఎగుమతులకు బ్రేక్ పడుతోంది. దీంతో ఈ రెండు దేశాల నుంచి గోధుమలు దిగుమతులు చేసుకునే 17 దేశాలలో ఆహార ధరలు భారీగా పెరగటమే గాక పలు వ్యవసాయాధారిత పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే, తూర్పు ఐరోపా దేశాల్లోనూ ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదముంది. మరోవైపు ఉక్రెయిన్‌ పునర్నిర్మాణం, పునరుద్ధరణ కోసం కీవ్ సాధారణ జీడీపీతో పోల్చితే మూడు రెట్లు ఖర్చవుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇక..రక్షణ రంగం కోసం దాదాపు 53.3 బిలియన్‌ డాలర్లను వెచ్చించాలని ఇటీవల 2025 బడ్జెట్‌ అంచనాల్లో ఉక్రెయిన్‌ పేర్కొంది. రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు అందించగా, పలు పశ్చిమ దేశాలు భారీగా సైనిక, ఆర్థికసాయాన్ని అందించాయి.

మరోవైపు, రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా 10 వేలమంది బలగాలను ఉక్రెయిన్‌లో దించటంతో అమెరికా.. మండిపడింది. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు..అగ్రరాజ్యం అనుమతి కూడా ఇచ్చింది. అయితే, అమెరికా దూకుడు.. మూడో ప్రపంచ యుద్ధాన్ని అనివార్యం చేస్తుందని రష్యా హెచ్చరించింది. మరోవైపు, రష్యాకు మద్దతుగా ఈ యుద్ధంలో దిగిన నార్త్ కొరియా ఇప్పుడు తలపట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 3వేల మంది తమ సైన్యం.. ఉక్రెయిన్ బలగాల చేతిలో మరణించటం, ప్రత్యేక శిక్షణ ఇప్పించి యుద్ధంలో దింపినప్పటికీ, భాష సమస్య కారణంగా వారు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో అక్కడే ఉండలేక, అలాగే.. వెనక్కి వెళ్లిపోతామని చెప్పలేక ఉత్తర కొరియా సతమతమవుతోంది. మరోవైపు, ఈ యుద్ధంలో పలు దేశాలు చేరే ప్రమాదం కనిపిస్తోంది. ముగింపు ఎప్పుడో తెలియని రీతిలో సాగుతున్న ఈ యుద్ధాన్ని తాను గద్దెనెక్కగానే ఆపేస్తానంటూ గత అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అయితే, రష్యాకు చెక్ పెట్టేందుకే అమెరికాతో సహా పలు దేశాల నేతలూ చెబుతున్నప్పటికీ, ఈ పరిస్థితిని చక్కదిద్ది శాంతి స్థాపనకు మాత్రం స్పష్టమైన కార్యాచరణతో ఎవరూ ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఇది ప్రపంచయుద్ధంగా మారకుండా చూసేందుకు ఐరాస వంటి సంస్థలు గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Exit mobile version