Ukraine Ready To Sign Minerals Deal With US: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో ఉన్న బంధాన్ని తాను కాపాడుకుంటామని జెలెన్ స్కీ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఖనిజాల ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదరకపోవడం తెలిసిన విషయమే. అయితే తాజాగా, ఈ విషయంపై జెలెన్ స్కీ స్పందించారు. ట్రంప్ ఆహ్వానిస్తే.. మరోసారి భేటీకి వెళ్తానని పేర్కొన్నారు. ఆయనతో తీవ్రమైన, నిజమైన సమస్యలను పరిష్కరించేందుకు తానే సిద్ధమేనని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వైట్ హౌస్ వేదికగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీలో ఇద్దరి మధ్య చేసుకున్న వాగ్వాదం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి. కాగా, ఈ భేటీకి ముందు జెలెన్ స్కీ.. రిపబ్లికన్, డెమోక్రటిక్ సెనెటర్లతో సమావేశమయ్యారని తెలుస్తోంది.
అయితే, జెలెన్ స్కీ, రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ మధ్య కీలక అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అనవసరంగా ఘర్షణలకు దారితీసే పరిస్థితులను సృష్టించవద్దని జెలెన్ స్కీకి లిండ్సే సూచించారని చెబుతున్నారు. ట్రంప్ విషయంలో ఘర్షణలకు దారితీయవద్దని, ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నారు.
కాగా, అమెరికన్లు మరోసారి చర్చలు జరిపేందుకు ఇష్టపడరని లిండ్సే పేర్కొన్నారు. జెలెన్ స్కీ తీరులో మార్పులు ఉంటేనే తర్వాతి చర్చలు జరిపే అవకాశం ఉందన్నారు. అయితే జెలెన్ స్కీ వ్యవహిరించిన తీరుపై ఈయూ నేతలు సపోర్ట్ ఇస్తున్నారు. ఉక్రెయిన్ ఒంటరి కాదని భరోసా కల్పిస్తున్నారు. అలాగే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, కెనెడా పీఎం జస్టిన్ ట్రూడో తో పాటు ఇతర దేశాధినేతలు అమెరికా తీరును తప్పుబట్టారు.