New York: ఇటీవలి కాలంలో న్యూయార్క్ నగరంలోకి వేలాది మంది అక్రమ వలసదార్లు పొటెత్తడంతో న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించారు. గత కొన్ని నెలల నుంచి అమెరికాకు దక్షిణ సరిహద్దు నుంచి వేలాది మంది లాటిన్ అమెరికన్‌లు బస్సుల్లో నగరంలోకి చొచ్చుకువస్తున్నారు. దీంతో నగరం పై ఒత్తిడి పెరిగిపోతోంది. నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన షెల్టర్ సిస్టం పై తీవ్ర ప్రభావం చూపుతోందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్‌వివరించారు.
సిటి హాల్లో మేయర్ ప్రసంగిస్తూ న్యూయార్క్ నగరంలోకి పెద్ద ఎత్తున వస్తున్న శరణార్థుల కోసం బిలియన్ డాలర్లు వ్యయం చేయాల్సి వస్తోందన్నారు. ఏప్రిల్ నెలలోనే ఏకంగా 17వేల కంటే ఎక్కువ మంది నగరంలోకి వచ్చారని అన్నారు. గత నెల నుంచి ప్రతి రోజు సరాసరి ఐదు నుంచి ఆరు బస్సుల్లో నగరంలోకి ప్రవేశిస్తున్నారన్నారు. గురువారం ఒక్క రోజే తొమ్మిది మినీ బస్సులో వచ్చారని డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఆడమ్స్ పేర్కొన్నారు. వీరి రాకతో న్యూయార్క్ నగరంలోని పలు షెల్టర్ హోమ్స్ కిటకిట లాడిపోతున్నాయన్నారు. వీరిపై కరుణ చూపించవచ్చు కానీ, వీరికి కావాల్సిన అవసరాలకు నిధులు ఎక్కడి నుంచి తేవాలని ఆయన ప్రశ్నిస్తున్నారు. వీరిని ఫెడరల్ గవర్నమెంట్‌తో పాటు రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలని, తమ వద్ద నిధులులేవని ఆయన స్పష్టం చేశారు. ఎమర్జన్సీ విధించడం వల్ల వలసదార్ల తాకిడిని నివారించవచ్చునని ఆయన అన్నారు.
అమెరికా – మెక్సికో సరిహద్దు నుంచి వస్తున్నవారిని టెక్సాస్ గవర్నర్ రిపబ్లిక్ పార్టీకి చెందన గ్రేగ్ అబ్బాట్, నేరుగా బస్సులో న్యూయార్క్ పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 3 వేల మందిని ఇలా తమ నగరంలోకి పంపారని, అక్రమ వలసదార్ల గురించి తమ నగర అధికారులకు సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. కాగా డెమెక్రాటిక్‌ల పాలనలో ఉన్న ఎల్ పాసో నగరం నుంచి సుమారు 7వేల మంది ఆగస్టు నెల చివర్లో న్యూయార్క్ నగరానికి వచ్చారు. దీంతో న్యూయార్క్ నగరం అక్రమ వలసదార్లలో కిటకిటలాడిపోతోంది. వీరికి కావాల్సిన అవసరాలు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నామని మేయర్ ఆవేదన వ్యక్తం చేశారు.