Singapore Suicides: సింగపూర్‌లో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత ఏడాది ఆత్మహత్యలు 22 ఏళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. క్రితం ఏడాదితో పోల్చుకుంటే ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయి. నగరంలోని ప్రజలు ఏదో తెలియని మానసిక వ్యాధితో బాధపడుతున్నారని స్థానిక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే అతి చిన్న వయసు వారు అంటే 10 నుంచి 29 ఏళ్ల వారు.. మరో పక్క వయసు పైబడిన వారు 70 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వారిలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుతున్నాయి. ఇది అక్కడి ప్రభుత్వానికి ఆందోళనకు గురి చేస్తోంది. కాగా తాజా గణాంకాలను ది ప్రివెన్షన్ సెంటర్ సమరిటన్స్ ఆఫ్ సింగపూర్ వార్షిక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.
గత ఏడాది అంటే 2022లో సింగపూర్‌లో మొత్తం 476 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో సూసైడ్‌లు జరగడం ఇదే మొదటిసారి.. కాగా 2000 సంవత్సరంలో మొత్తం 378 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ స్థాయిలో ఆత్మహత్మలు జరగడం మనసును కలిచివేస్తోందని మెంటల్ హెల్త్ కన్సెల్టెంట్ జారెడ్ ఎన్‌జీ ఆందోళన వ్యక్తం చేశారు. సింగపూర్‌లో భారీ సంఖ్యలో ఆత్మహత్యలు జరగడం అంటే ఇక్కడి పౌరులు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని.. ముఖ్యంగా యువతతో పాటు ముసలి వారిలోనే ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు. మానసిక వ్యాధుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సమాజం నుంచి దూరంగా ఉండటం, ఏకాంతంగా ఉండటం ఇవన్నీ కలిసి మానసికంగా కుంగదీస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఆత్మహత్యల విషయానికి వస్తే 10 నుంచి 29 ఏళ్ల వయసు వారిలో వరుసగా గత నాలుగు సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తోంది. అన్నీ వయసు వారిని పరిగణనలోకి తీసుకుంటే వీరి సంఖ్య 33.6 శాతంగా తేలింది. గత ఏడాది ఇదే గ్రూపునకు చెందిన వారు 125 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతకు ముందు అంటే 2021లో 112 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. సుమారు 11.6 శాతం ఆత్మహత్యలు పెరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 29 ఏళ్ల వయసు వారి మరణాల్లో ఎక్కువగా ఆత్మహత్యలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఇక సింగపూర్ విషయానికి వస్తే 70 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వయసు వారు 2022 లో 48 మంది ఆత్మహత్య చేసుకోగా 2021లో 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ లెక్కన తీసుకుంటే వయసు పైబడిన వారిలో ఆత్మహత్యలు 60 శాతం పెరిగినట్లు తేలింది. ఇక సింగపూర్ విషయానికి వస్తే ప్రపంచంలోనే అతి తక్కువ గర్భధారణ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ జనాభాలో వయసు పైబడిన వారే ఎక్కువగా ఉన్నారు. 2030 నాటికి సింగపూర్‌లో ఉండే వారిలో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్ల పైబడ్డవారు ఉంటారని చెబుతున్నారు. ఇదే మూడేళ్ల క్రితం ప్రతి ఆరుగురిలో ఒకరు 65 ఏళ్లపైబడ్డ వారు ఉంటారని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.
ఆత్మహత్యలకు దారితీసిన అంశాల విషయానికి వస్తే ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు, నిరుద్యోగ సమస్య, లేదా ఆర్థిక పరమైన ఇబ్బందులు, దీంతో పాటు ప్రేమ విఫలం కావడమని ఎస్‌ఓఎస్ పేర్కొంది. గత ఏడాది ఆత్మాహత్య చేసుకున్న 476 మంది 317 మంది పురుషులు కాగా. 159 మంది స్ర్తీలు. ఇక వయసు పైబడ్డ వారి విషయానికి వస్తే ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబసమస్యలు, ఏకాంతంగా ఉండటంతో ఇవన్నీ ఆత్మహత్యకు పురికొల్పుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 700,000 మందికి పైగా ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్ద (WHO) తెలిపింది.