Site icon Prime9

Ukraine Ceasefire : ఉక్రెయిన్‌లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ.. పుతిన్ ఆదేశాలు జారీ

Ukraine Ceasefire

Ukraine Ceasefire

Ukraine Ceasefire : ఉక్రెయిన్‌‌పై రష్యా తాత్కాలిక కాల్పుల విరమణను ప్రకటించింది. విక్టరీ డే సందర్భంగా మే 8వ తేదీ నుంచి 10వరకు పూర్తిస్థాయి కాల్పుల విరమణ పాటిస్తామని క్రెమ్లిన్‌ వెల్లడించింది. మానవతా దృక్పథంతో దేశాధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా ప్రకటన వెలువడింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా రష్యా సర్కారు ఏటా మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తుంది.

 

త్వరలో శాంతి ఒప్పందం..
శాంతి ఒప్పందానికి రష్యా, ఉక్రెయిన్‌ ఇరుదేశాలు అతి సమీపానికి వచ్చాయని, త్వరలో రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వాటికన్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమైన అనంతరం పుతిన్‌పై విరుచుకుపడ్డారు. పుతిన్‌కు యుద్ధం ఆపాలన్న ఉద్దేశం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. క్రిమియా విషయంలో మాత్రం పలు సందర్భాల్లో మాస్కోకు మద్దతుగా డొనాల్డ్ ట్రంప్‌ ప్రకటనలు చేశారు. అయితే, క్రిమియాపై రష్యా అధికారాన్ని మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదని ఉక్రెయిన్‌ స్పష్టం చేసింది.

Exit mobile version
Skip to toolbar