Russia city: ఉక్రెయిన్‌పై భీకర దాడులకు పాల్పడుతున్న రష్యా తాజాగా సొంత నగరంపైనే బాంబు దాడి చేసింది. నాలుగు లక్షల జనాభా ఉన్న పట్టణంపై తన యుద్ధ విమానం నుంచి ఓ ఆయుధాన్ని జారవిడిచింది. పేలుడు ధాటికి నగరంలో ఓ కూడలి వద్ద దాదాపు 40 మీటర్ల వ్యాసంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. సమీపంలోని భవనాలు ధ్వంసం కావడంతోపాటు వాహనాలూ ఎగిరిపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీని ప్రకటించారు.
పేలుడు ధాటికి దెబ్బతిన్న పలు భవనాలు..(Russia city)
రష్యాలోని బెల్గొరాడ్ నగరం ఉక్రెయిన్‌కు సరిహద్దులో సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గురువారం రాత్రి రష్యాకు చెందిన సుఖోయ్ యుద్ధ విమానం ఈ నగరంపై ప్రయాణించింది. అదే సమయంలో యుద్ధ విమానం నుంచి ప్రమాదవశాత్తు ఓ బాంబు జారిపడింది. అది పడిన ప్రదేశంలో భారీ గొయ్యి ఏర్పడింది. పలు భవనాలు దెబ్బతిన్నాయి. పేలుడు ధాటికి ఓ కారు ఎగిరి సమీప ఇంటిపైకప్పు మీద పడినట్లు రష్యా వార్తాసంస్థ ఆర్‌ఐఏ వెల్లడించింది. ఈ ఘటనపై స్పందించిన బెల్గొరాడ్ మేయర్ వాలెంటిన్ దెమిదోవ్.. ఈ పేలుడు కారణంగా అనేక భవనాలు దెబ్బతినడంతోపాటు ఇద్దరు స్థానికులకు గాయాలైనట్లు తెలిపారు.
కొత్తగా సుఖోయ్-34 యుద్ధ విమానాలు..
మరోవైపు ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ.. కొత్తగా సుఖోయ్-34 యుద్ధ విమానాలను రష్యా సైన్యానికి అందించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అవి ఎన్ని ఇచ్చారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. విభిన్న ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఈ యుద్ధ విమానాలకు ఉంది. అయితే, తాజా ఘటనలో ఏ రకమైన ఆయుధం ఈ ప్రమాదానికి కారణమైందనే విషయాన్ని రష్యా రక్షణశాఖ వెల్లడించలేదు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌కు సమీపంలో ఉన్న బెల్గొరాడ్ నగరంలో రష్యా ఆయుధ కేంద్రం ఉంది. ఈ నగరంపై ఉక్రెయిన్ బలగాలు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా పలుమార్లు ఆరోపించిన విషయం తెలిసిందే.బెల్గోరోడ్ గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడుతూ, పేలుడుకు సమీపంలో ఉన్న తొమ్మిది అంతస్తుల అపార్ట్మెంట్ భవనంలో నివాసితులకు తాత్కాలికంగా పునరావాసం కల్పించాలని స్థానిక అధికారులు నిర్ణయించారని తెలిపారు.