Road Accident : ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. వెనిస్ లో పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్‌పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులంతా వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాల్ని సందర్శించి తిరిగి వారి క్యాంపింగ్ సైట్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మృతులు, క్షతగాత్రుల్లో ఇటలీ పౌరులతో పాటు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు అదుపు తప్పి కింద పడగానే బస్సులోని మీథేన్ ఇంధనం లీకై మంటలు చెలరేగడంతో ప్రమాదం తీవ్రత పెరిగిందని చెప్పారు. బస్సు ప్రమాదంపై ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. “మేస్త్రీలో జరిగిన ఘోర ప్రమాదానికి నా తరపున, మొత్తం ప్రభుత్వం తరపున నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నా ఆలోచనలు బాధితులు, వారి కుటుంబాలు మరియు స్నేహితులతో ఉన్నాయి. ఈ విషాదం గురించి అప్డేట్ కోసం తాను మేయర్ లుయిగి బ్రుగ్నారో,మంత్రి (ఇంటీరియర్) మాటియో పియాంటెడోసితో సన్నిహితంగా ఉన్నానని రాసుకొచ్చారు.