Site icon Prime9

Vladimir Putin: రష్యా ఉప రక్షణమంత్రిని తొలగించిన పుతిన్

Russia

Russia

Russia: ఉక్రెయిన్‌తో యుద్ధంలో కొన్నాళ్లుగా రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మెరుపు దాడులతో ఉక్రెయిన్‌ దళాలు మాస్కో సేనలను భారీగా దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రక్షణశాఖ మంత్రిగా ఉన్న జనరల్‌ దిమిత్రి బుల్గకోవ్ ను ఆ పదవినుంచి తొలగించారు. ఆయన స్థానంలో కర్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సేవ్‌ ను నియమించారు. ‘ఆర్మీ జనరల్ దిమిత్రి బుల్గకోవ్ ఉప రక్షణ మంత్రి బాధ్యతల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఆయనకు వేరే ఇతర బాధ్యతలు అప్పగిస్తాం’ అని రష్యా రక్షణ మంత్రి టెలిగ్రామ్‌లో చెప్పారు. అయితే, ఆ బాధ్యతలు ఏంటో మాత్రం వెల్లడించలేదు.

జనరల్ బుల్గకోవ్ 2008 నుంచి రష్యా మిలలిటరీ లాజిస్టిక్స్ కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అయితే, కొన్నాళ్లుగా ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం బాగా వెనుకబడిపోయింది. ఇటీవల ఖర్కివ్‌ ప్రాంతంనుంచి మాస్కో సేనలు వెనుదిరిగాయి. లాజిస్టిక్స్ నిర్వహణలో వైఫల్యం కూడా దీనికి ఓ కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పుతిన్ ఆయనపై చర్యలకు ఉపక్రమించినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బుల్గకోవ్‌ స్థానంలో వచ్చిన మిజింట్సేవ్‌.. ఉక్రెయిన్‌ ఓడరేవు నగరమైన ‘మేరియుపోల్‌’ విధ్వంసకుడిగా అపకీర్తి మూటగట్టుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో రష్యన్‌ సేనలు ఇక్కడ భారీ విధ్వంసం సృష్టించాయి. ఆర్ట్‌ గ్యాలరీలు, ప్రసూతి ఆసుపత్రులు, థియేటర్లు అనే తేడా లేకుండా సర్వనాశనం చేశాయి.

ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా క్రమంగా పట్టుకోల్పోతోంది. రష్యా సైన్యం వెనుకబడ్డంతో అదే సమయంలో ఉక్రెయిన్‌ సైన్యం పుంజుకోవడంతో పుతిన్‌ పునరాలోచనలో పడ్డారు. సైన్యంలో మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టారు.

Exit mobile version