Prince Harry: 7 దశాబ్దాల పాటు బ్రిటన్ ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్ -2 గత ఏడాది సెప్టెంబర్ లో మరణించిన విషయం తెలిసిందే. అనంతరం బ్రిటన్ తదుపరి రాజుగా ఛార్లెస్ -3 బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మే 6 వ తేదీన బ్రిటన్ రాజుగా ఛార్లెస్ -3 పట్టాభిషేకం జరుగనుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరగుతున్నాయి. ఈ పట్టాభిషేకానికి ఛార్లెస్ 3 కుమారుడు ప్రిన్స్ హ్యారీ హాజరవుతున్నారు. అయితే బ్రిటన్ రాజరికాన్ని వదులుకున్న హ్యారీకి ఈ వేడుకలో తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పట్టాభిషేకానికి హాజరైన ఆయన అతి తక్కువ సమయం అక్కడ కేటాయిస్తారని సమాచారం. అంతే కాకుండా హ్యారీ రాజకుటుంబానికి 10 వరుసల తర్వాత కూర్చుంటారని తెలుస్తోంది.
సయోధ్య కుదరకపోవచ్చు(Prince Harry)
పట్టాభిషేకం సందర్బంగా హ్యారీ తన కుటుంబంతో సయోధ్య కుదరక పోవచ్చని రాజకుటుంబ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘వారి మధ్య రాజీకి అవకాశాలు కనిపించడం లేదు. ఆయనకు విండ్సర్స్ నుంచి తగిన ఆదరణ లభించకపోవచ్చని నేను భావిస్తున్నాను. అయితే తన తండ్రి కోరిక మేరకు హ్యారీ ఆ వేడుకకు హాజరవుతున్నాడు’ అని ఆయన తెలిపారు. తండ్రి మీద గౌరవంతో డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ హోదాలో మాత్రమే హ్యారీ బ్రిటన్ కు వస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా, ఈ పట్టాభిషేక కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. అయితే హ్యారీ కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమంలో మాత్రమే అక్కడ ఉంటారని తెలుస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఆయన యూకే వచ్చి తిరిగి వెళ్లిపోతారని సమాచారం. అయితే ప్రిన్స్ హ్యారీతో పాటు ఆయన భార్య మేఘన్ మార్కల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యే దానిపై స్పష్టత లేదు.
ప్రిన్స్ హ్యారీ తన సోదరుడు ప్రిన్స్ విలియంపైనా, కింగ్ చార్లెస్‌పైనా ఇటీవల కొన్ని ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన రాసిన పుస్తకంలో కూడా రాజవంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు.