Nobel Prize in Chemistry: వివిధ రంగాల్లో ఈ ఏడాది నోబెల్ పురస్కారాలను ప్రకటిస్తున్న స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెన్స్ బుధవారంనాడు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డును ప్రకటించింది. ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ బహుమతి వరించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి , లాయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్‌లను విజేతలుగా అకాడమీ ప్రకటించింది.
క్వాంటమ్ డాట్స్‌ను కనుగొనడం, అభివృద్ధి చేయడానికి సంబంధించి చేసిన పరిశోధనలకు గాను ఈ అవార్డును అందజేస్తున్నట్టు అకాడమీ ప్రకటించింది. శాస్త్రజ్ఞుల పరిశోధనల గురించి అకాడమీ వివరిస్తూ, క్వాంటమ్స్ డాట్స్ చాలా సూక్ష్మమైన పార్టికల్స్ అని తెలిపింది. వీటి ఆవిష్కరణ, అభివృద్ధిలో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు చేశారని, క్వాంటమ్స్ డాట్స్‌ను టీవీల నుంచి ఎల్‌టీ లైట్ల వరకూ అనేక పరికరాల్లో ఉపయోగిస్తున్నామని వివరించింది. ట్యూమర్ కణాలను తొలగించేందుకు వైద్యులు సైతం ఈ సాంకేతితను వాడుతున్నట్టు తెలిపింది. కాగా, గత సోమవారం వైద్య రంగంలో సేవలకు నోబెల్ బహుమతిని అకాడమీ ప్రకటించగా, మంగళవారంనాడు భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ ప్రకటించింది. రసాయనిక శాస్త్రంలోనూ బుధవారం ముగ్గురికి అవార్డు ప్రకటించింది. నోబెల్ శాంతి పురస్కారాన్ని గురువారం ప్రకటించనుంది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్దంతి రోజైన డిసెంబర్ 10న అవార్డుల ప్రదానం ఉంటుంది. ఈ అవార్డు కింద విజేతలకు పురస్కారంతో పాటు 10 లక్షల అమెరికా డాలర్ల నగదు అందజేస్తారు.