New zealand Earthquake: వరదలు, భూకంపాలతో వణుకుతున్న న్యూజిలాండ్

New zealand Earthquake: న్యూజిలాండ్ ఒక పక్క సైక్లోన్ గాబ్రియేల్ విధ్వంసం సృష్టిస్తుండగా.. మరో పక్క తీవ్ర భూకంపంతో వణికిపోయింది. న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ సమీపంలోని లోయర్ హట్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదు అయినట్టు అధికారులు గుర్తించారు.

పరాపరౌముకు వాయువ్యంగా 50 కిలో మీటర్ల దూరం.. 76 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. సునామీ హెచ్చరికలు కూడా లేవని అక్కడి అధికారులు స్పష్టం చేశారు.

ఆందోళనలో న్యూజిలాండ్(New zealand Earthquake)

ప్రకృతి విపత్తులు ఎక్కువగా ఉండే ‘రింగ్ ఆఫ్ ఫైర్’జోన్ లోనే న్యూజిలాండ్ ఉంది. దేశంలో సుమారు 50 లక్షల జనాభా నివసిస్తోంది.

2011 లో క్రిస్ట్ చర్చ్ లో వచ్చిన భూకంపానికి 185 మంది ప్రాణాలు కోల్పోయారు. వేల ఇళ్లు నెలకొరిగాయి.

టర్కీ, సిరియాల్లో ఇటీవల వచ్చిన భారీ భూప్రళయం సృష్టించిన నేపథ్యంలో న్యూజిలాండ్ లోనూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

 

మూడోసారి నేషనల్ ఎమర్జెన్సీ

కాగా, న్యూజిలాండ్ లో గాబ్రియేల్ తుపాన్ పెను ప్రభావం చూపిస్తోంది. ఆ దేశ చరిత్రలోనే మంగళవారం మూడోసారి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

కరెంట్ లేక వేల కుటుంబాలు అందకారంలో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. గంటకు 140 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

దాదాపు 11 మీటర్ల ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయని న్యూజిలాండ్ వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు నిద్రలేచే సమయానికి విపత్తు దేశమంతా ఆవరించిందని ప్రధాని క్రిస్ హిప్ కిన్స్ తెలిపారు.

కొన్ని వారాల క్రితమే ఆక్లాండ్, ఉత్తర ఐలాండ్ ప్రాంతాలను భారీ తుపాను వణికించింది. గత నెలలో ఆక్లాండ్ లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయి భారీగా వరదలు సంభవించాయి.

తాజాగా ఇపుడు దేశంలో ఉత్తర ఐలాండ్ లోని కొన్ని భాగాల్లో 30 జాతీయ రహదారులు, పోర్టులు, రైల్వే స్టేషన్లు , ఎయిర్ పోర్టులు మూసివేశారు.

ఆక్లాండ్ ఎయిర్ పోర్టు నుంచి దేశీయంగా ప్రయాణించాల్సిన 55 విమానాలను రద్దు చేశారు. దేశ వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన రెడ్ వార్నింగ్ ను జారీ చేసింది.