Site icon Prime9

Train Hijack Pakistan : 27 గంటలు మోకాళ్లపైనే.. ట్రైన్ హైజాక్‌ ఘటన బందీలు

Pakistan

Train Hijack Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్‌‌లో ట్రైన్ హైజాక్‌‌కు గురైన ఘటనలో బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ అదుపులో ఉన్న సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. మిలిటెంట్ల చెరలో తాము అనుభవించిన కష్టాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదులు ట్రైన్ ఇంజిన్‌ కింద పేలుడు పదార్థాలు అమర్చి పేల్చారు. దీంతో బోగీలు పట్టాలు తప్పినట్లు రైలు డ్రైవర్‌ అమ్జాద్‌ పేర్కొన్నాడు. రైలు ఆగిన వెంటనే ఉగ్రవాదులు కిటికీలను పగులగొట్టి ఆయుధాలతో బోగీల్లోకి చొరబడ్డారని తెలిపాడు. అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదని అన్నాడు.

 

తమను కాపాడడానికి ప్రయత్నించిన సైనికులను దారుణంగా హత్య చేశారని తెలిపాడు. పారిపోవడానికి ప్రయత్నించినవారిని కాల్చి చంపడంతోనే భయంతో తాము అక్కడే ఉండిపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు. మహిళలు, చిన్న పిల్లలపై మిలిటెంట్లు దాడి చేశారన్నారు. మహబూబ్‌ అహ్మద్‌ అనే వ్యక్తి మాట్లాడారు. వేర్పాటువాదులు తమను బందీలుగా చేసుకున్నారని తెలియడంతో తాము జీవితంపై ఆశలు వదులుకున్నామని చెప్పాడు. రైలులో మృతదేహాలను చూసి భయంతో వణికిపోయినట్లు తెలిపాడు.

 

బందీలుగా చేసుకున్న తమను మారుమూల పర్వత ప్రాంతాల్లో గంటల తరబడి నడిపించుకుంటూ తీసుకువెళ్లి వివిధ ప్రదేశాల్లో బంధించారని తెలిపాడు. 27 గంటల పాటు తమను మోకాళ్లపైనే కదలకుండా కూర్చోబెట్టారని గుర్తుచేసుకున్నాడు. తాగడానికి నీళ్లు తప్ప ఎటువంటి ఆహారం ఇవ్వలేదని, పిల్లలు ఆకలితో గుక్కపట్టి ఏడుస్తున్నా కనికరం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పాక్‌ భద్రతా దళాలు తమను విడిపించడానికి తీవ్రంగా శ్రమించాయని, అందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నాడు.

 

పాకిస్థాన్‌లో 500 మంది ప్రయాణికులతో వెళ్తున్న ట్రైన్ హైజాక్‌‌కు గురైన ఘటనలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌ కొనసాగుతోంది. బలోచ్‌ లిబరేషన్‌ ఆర్మీ అదుపులో ఉన్న బందీల్లో 80 మందిని సైనిక బలగాలు సురక్షితంగా విడిపించాయి. 43 మంది పురుషులు, 26 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మిలిటెంట్ల అదుపులో వంద మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన కాల్పుల్లో 33 మంది మిలిటెంట్లు చనిపోయినట్లు పాక్‌ ప్రభుత్వ అధికారులు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar