Zabihullah Mujahid: మసూద్‌ అజర్ మా దేశంలో లేడు.. తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌

పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్ తమ దేశంలో లేడని అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ సర్కారు తేల్చి చెప్పింది. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌ భూభాగం నుంచే, అది కూడా అక్కడి ప్రభుత్వ సహకారంతోనే పనిచేస్తాయని కౌంటర్‌ ఇచ్చింది.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 06:19 PM IST

Afghanistan: పుల్వామా ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి, కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్ తమ దేశంలో లేడని అఫ్గానిస్థాన్‌లోని తాలిబన్‌ సర్కారు తేల్చి చెప్పింది. అలాంటి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్‌ భూభాగం నుంచే, అది కూడా అక్కడి ప్రభుత్వ సహకారంతోనే పనిచేస్తాయని కౌంటర్‌ ఇచ్చింది. ఇతర దేశాలకు వ్యతిరేకంగా తమ భూభాగాన్ని ఉపయోగించుకునేందుకు ఎవర్నీ అనుమతించేది లేదని స్పష్టం చేసింది. మసూద్‌ అఫ్గాన్‌లోనే ఉన్నాడన్న పాకిస్థాన్‌ మీడియా కథనాలను తోసిపుచ్చుతూ, తాలిబన్‌ ప్రభుత్వ ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా మసూద్‌ అజర్‌ అఫ్గానిస్థాన్‌లోనే తలదాచుకున్నాడని, అతడిని వెతికి పట్టుకోవాలంటూ పాకిస్థాన్‌ విదేశాంగశాఖ అంతకు ముందురోజు తాలిబన్‌ సర్కారుకు లేఖ రాసింది. నంగ్రహార్‌ లేదా కునార్‌ ప్రావిన్స్‌లో అతడు ఉన్నట్టు అందులో పేర్కొంది. అజ్‌హర్‌ పై చర్యలు తీసుకోవాలని పశ్చిమదేశాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న క్రమంలో పాక్‌ సర్కారు ఈ లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకొంది. 2019 నాటి పుల్వామా ఉగ్రదాడుల్లో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు మసూద్‌ ప్రధాన సూత్రధారిగా పనిచేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

2008 నాటి ముంబయి ఉగ్రదాడులకు మాస్టర్‌ మైండ్లుగా పనిచేసిన లష్కరే తొయిబా చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌, ఆపరేటివ్‌ సాజిద్‌ మిర్‌ తదితర 30 మంది ఉగ్రవాదులను వెతికి, వారి పై విచారణ చేపట్టాలన్న భారత్‌ డిమాండ్‌కు, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) అంగీకరించింది. పశ్చిమ దేశాలూ ఇందుకు మద్దతు తెలిపాయి. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా గుర్తించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఎఫ్‌ఏటీఎఫ్‌ నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. భారత్‌ గతంలోనే మసూద్‌ను అరెస్టు చేసినా, ఉగ్రవాదులు ఎయిర్‌ ఇండియా విమానం నేపాల్‌ హైజాక్‌ చేసి కందాహార్‌ తరలించారు. 1999లో వాజపేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పలువురు కరడుగట్టిన తీవ్రవాదులను విడిపంచుకుపోయారు. వారిలో మసూద్‌ ఒకరు.