Italy Parliament: ఇటలీ పార్లమెంట్‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఆ దేశానికి చెందిన మహిళా ఎంపీ గిల్డా స్పోర్టిల్లో తన కుమారుడికి పార్లమెంట్ హాల్‌లోనే పాలు ఇచ్చింది. సభ్యులు కూర్చునే బెంచ్ వద్ద పిల్లోడిని ఎత్తుకుని చనుబాలు తాగించింది. ఈ ఘటన పట్ల తోటి ఎంపీలు హర్షం వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టారు. సంప్రదాయంగా పురుషుల ఆధిక్యం ఉన్న ఇటలీలోని దిగువ సభలో ఇలాంటి ఘటన జరగడం విశేషమే.
ఎంపీ గిల్డా కుమారుడి పేరు ఫెడ్రికో. ఆర్నెల్ల వయసే ఉన్న ఆ చిన్నారికి పార్లమెంట్‌లో ఉన్న ఎంపీలు ఆశీస్సులు అందించారు. సుదీర్ఘమైన, స్వేచ్ఛాయుతమైన, శాంతియుత జీవితాన్ని ఫెడ్రికో పొందాలని కోరుతూ ఆ సభలను నిర్వహిస్తున్నట్లు చైర్మెన్ జార్జియో మూల్ తెలిపారు.పాలు తాగే పిల్లలు ఉన్న మహిళా ఎంపీలు తమ పిల్లలను పార్లమెంట్‌కు తీసుకురావచ్చు అని గత నవంబర్‌లో ఇటలీ చట్టం చేసింది. ఏడాది వయసు వచ్చే వరకు పిల్లలకు బ్రెస్ట్‌ఫీడింగ్ చేయవచ్చు అని తీర్మానించారు.
చాలా మంది మహిళలు ముందుగానే తల్లి పాలివ్వడాన్ని ఆపివేస్తారు.. అయితే అది కావాలని కాదు వారు కార్యాలయానికి తిరిగి వెళ్లవలసి వస్తుందని స్పోర్టిల్లో పేర్కొన్నారు. నేటి నుండి, అత్యున్నత ఇటాలియన్ సంస్థలు కార్మికులను వారి కార్యాలయంలో నర్సింగ్ చేయడానికి అనుమతిస్తే, ఏ వృత్తిలోనైనా ఏ స్త్రీకి ఈ హక్కు నిరాకరించబడదని స్పోర్టియెల్లో చెప్పారు.లా రిపబ్లికా దినపత్రిక స్పోర్టియెల్లోని ఉటంకిస్తూ, తన మార్గదర్శక చర్య ఇటలీలోని అన్ని వర్క్‌ప్లేస్‌లకు స్ఫూర్తినిస్తుందని, ఉద్యోగంలో ఉన్న తల్లులు ఉద్యోగంలో ఉన్నప్పుడు వారి శిశువులకు పాలివ్వడాన్ని సులభతరం చేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.