ISRO successfully launches PSLV-C59 rocket with European Space Agency’s Proba-3: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ59 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహకనౌక నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఇస్రో విజయవంతగా ప్రయోగించింది. ప్రోబా-3 తీసుకుపోయిన రెండు ఉప గ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగలిగామని ఇస్రో ప్రకటించింది. బుధవారం సాంకేతిక లోపం కారణంగా ఆగిన ఈ ప్రయోగం నేడు విజయవంతం కావటంపై ఇస్రో వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.
ప్రోబా -3 దేనికి ?
ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ఇస్రో.. ప్రోబా-3ని ప్రయోగించింది. ప్రోబా-3 మిషన్‌లో రెండు ఉపగ్రహాలు (కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్, ఆక్యుల్టర్ స్పేస్‌క్రాఫ్ట్) ఉన్నాయి. మొత్తం దాదాపు 550 కిలోల బరువు ఉండే ఈ ఉపగ్రహాలను అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ రెండు ఉపగ్రహాల్లో ఒకటి కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తే..రెండవది కరోనాను నిశితంగా పరిశీలించనుంది. ఈ రెండు ఉపగ్రహాలు ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారని ఈఎస్ఏ తెలిపింది. ప్రోబా-3 మిషన్‌లో స్పెయిన్, పోలాండ్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు భాగస్వాములయ్యారు.
సూర్యుడి గుట్టు విప్పినట్లేనా?
ప్రోబాలోని రెండు ఉపగ్రహాలు భూమి నుంచి 60 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ, సూర్యుడి బయటి పొర మీద ఓకన్నేసి ఉంచుతూ నిరంతరం అక్కడి వాతావరణ మార్పులను భూమి మీదికి పంపుతూ ఉంటాయి. ఈ రెండు ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూ కక్ష్యలో పయనిస్తుంటాయి. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని సృష్టించడం వంటి ప్రయోగాలకు కూడా ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి. కాగా, ‘లిఫ్టాఫ్ సాధించాం! పిఎస్ఎల్ వి – సి59 నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఎన్ఎస్ఐఎల్ నేతృత్వంలో గ్లోబల్ మిషన్ ప్రారంభం అయింది. ప్రోబా-3 ఉపగ్రహాలను పంపించాం.’అని ఇస్రో తన ట్వీట్లో పేర్కొంది.
శాస్త్రవేత్తల సంతోషం
ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రోఛైర్మన్ ఎస్. సోమ్‌నాథ్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రోబా తదుపరి ప్రయోగాలకు ఈ విజయం ప్రేరణ కానుందని ఆయన పేర్కొన్నారు. ఇస్రో వాణిజ్య విభాగమైన.. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని పేర్కొన్నారు. డిసెంబరులో స్పేటెక్స్ పేరుతో పీఎస్ఎల్వీ-సీ60 ప్రయోగం ఉంటుందని ఇస్రోఛైర్మన్ తెలిపారు. ఈ ఉపగ్రహంతోనే ఆదిత్య ఎల్-1 సోలార్ మిషన్ కొనసాగుతుందన్నారు.