Pakistan Heart patients: పాకిస్తాన్‌లో హృద్రోగులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. గుండె జబ్బుల చికిత్సకు కావాల్సిన ముఖ్యమైన హెపారిన్ ఇంజక్షన్‌కు తీవ్రమైన కొరత ఏర్పడింది. దీనితో అక్కడి రోగులు చికిత్స పొందడానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అయితే హెపారిన్ ఇంజక్షన్ సాధారణ ధర 600 రూపాయలున్నప్పటికీ, కొరత కారణంగా ధరను అమాంతంగా 3 వేలకు పెంచి అక్రమంగా అమ్ముతున్నారని సదరు నివేదిక పేర్కొంది. అంతేగాక మందులు, వైద్య పరికరాల కొరత కారణంగా వైద్యులు సర్జరీలు నిర్వహించడం లేదని కూడా వెల్లడించింది.
పాకిస్తాన్‌లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది, ఇక్కడ రోగులు అవసరమైన మందుల కోసం కష్టపడుతున్నారు.మత్తుమందులు, ఇన్సులిన్, పనాడోల్, బ్రూఫెన్, డిస్ప్రిన్, కాల్పోల్, టెగ్రల్, నిమెసులైడ్, హెపామెర్జ్, బస్కోపాన్ మరియు రివోట్రిల్‌తో సహా అవసరమైన మందుల కొరతను దేశం ఎదుర్కొంటోంది. ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడుతుండడంతో స్థానిక ఔషధ తయారీదారులు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఫారెక్స్ నిల్వలు లేకపోవడం వల్ల అవసరమైన మందులు లేదా దేశీయ ఉత్పత్తిలో ఉపయోగించే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియంట్స్ (API) దిగుమతి చేసుకునే పాకిస్థాన్ సామర్థ్యం క్షీణించిందని ఫిబ్రవరిలో నివేదికలు తెలిపాయి.
మందుల తయారీ ఉత్పత్తిలో దాదాపు 95 శాతం ముడి సరుకులు భారత్, చైనాల నుంచే దిగుమతి అవుతాయి. ఆర్థికంగా పరిస్థితులు దిగజారడంతో.. దిగుమతులు కూడా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్ ఆర్ధికంగా దివాలా తీయడానికి సిద్దంగా ఉంది. పాక్ సెంట్రల్ బ్యాంకు వద్ద విదేశీ మారకద్రవ్యం భారీగా తగ్గిపోవడంతో దిగుమతులు తగ్గించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అత్యవసర మందులు తయారు చేసుకోవడానికి కావాల్సిన ముడి సరకును కూడా తగ్గించేశాయి.