Gaza Strip:హమాస్ నెట్‌వర్క్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర పోరులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాను నలువైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ దళాలు.. ఈ నగరాన్ని రెండుగా విభజించినట్లు ప్రకటించాయి.
గాజా నగరాన్ని చుట్టుముట్టి ఉత్తర గాజా, దక్షిణ గాజాగా విభజించాయి. ఈ యుద్ధంలో ఇది చాలా కీలక ఘట్టం. త్వరలో మరిన్ని కీలక దాడులు చేయబోతున్నాం అని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారీ మీడియాకు వెల్లడించారు. ఇజ్రాయెల్ గాజాలో ద్విముఖ వ్యూహంపై పనిచేస్తోంది, ఇది భారీ బాంబు దాడులు మరియు ఉత్తరాన భారీ భూదాడి చేస్తున్నందున పౌరులు దక్షిణం వైపు వెళ్లాలని కోరుతున్నారు, ఇక్కడ హమాస్ వారి కార్యకలాపాలకు సహాయపడే భూగర్భ సొరంగాల విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉందని నమ్ముతారు.
కనీసం 800,000 మంది పాలస్తీనియన్లు గాజా నగరం మరియు ఇతర ఉత్తర ప్రాంతాల నుండి దక్షిణం వైపుకు పారిపోయారు, అయితే ఇజ్రాయెల్ ఖాళీ చేయమని పదే పదే చెప్పినప్పటికీ ఇంకా వేల మంది ఉత్తరాదిలోనే ఉన్నారు.ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 9,700 దాటింది, వారిలో 4,000 కంటే ఎక్కువ మంది పిల్లలు మరియు మైనర్లు, గాజాలో హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో, హింస మరియు ఇజ్రాయెల్ దాడులలో 140 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు.అక్టోబర్ 7 నుంచి మొదలైన పోరులో ఇప్పటి వరకు సుమారు 15 లక్షల మంది ప్రజలు గాజాలో నిరాశ్రయులయ్యారు. గాజాలో నివసిస్తున్న సామాన్య పాలస్తీనా పౌరులు కేవలం ముక్కల రొట్టెలతో కాలం గడుపుతున్నారు. గాజా నగరంలో నీటి కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడ చూసినా.. నీరు కావాలి అంటూ కనిపించిన వారిని దీనంగా అడుగుతున్నాని యూఎన్ ఏజెన్సీ తెలిపింది. ఆహార సరఫరా కూడా అతి తక్కువగా అందుతోంది. ఇక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆకలితో చచ్చిపోతారేమో అన్న భయంతో వణికిపోతున్నారు.
గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ అంతర్జాతీయంగా పలు దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో పాలస్తీనా కు మద్దతుగా తుర్కియే లో చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. గాజాలో పరిస్థితులపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ సోమవారం తుర్కియే వచ్చారు. ఆయన రావడానికి కొన్ని గంటల ముందు తుర్కియే రాజధాని అంకారాలో పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో నిరసనకారులు అంకారాలో అమెరికా సైనిక బలగాలు ఉన్న ఎయిర్‌బేస్‌లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో తుర్కియే పోలీసులు వాటర్ కెనన్‌లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపైకి కుర్చీలు, రాళ్లు విసిరారు. పరిస్థితి మరింత దిగజారడంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది.