Economic Crisis in Pakistan: మరో పదేళ్లలో పాకిస్థాన్ కుప్పకూలిపోవడం ఖాయం.. ఏడాదిన్నర క్రితం అట్లాంటిక్ కౌన్సిల్ సర్వే తేల్చి చెప్పిన విషయమిది. ఆ సర్వే సంస్థ చెప్పిన మాటలు అక్షర సత్యాలని ఆ దేశంలోని పరిస్థితులు ముమ్మాటికీ రుజువు చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో మునిగి పోయిన ఆ దేశం ఇప్పుడు ఉగ్రభూతం కోరలకు బలైపోతోంది. దాదాపు 40 ఏళ్లు సైనిక పాలనలోనే మగ్గిన పాక్.. 1973లోనే తన బడ్జెట్‌లో 90% సైన్యంపై వెచ్చించింది. అప్పట్లో సోవియట్ రష్యాపై పైచేయి సాధించేందుకు అమెరికా నుంచి మిలియన్ల డాలర్ల సాయాన్ని రాబట్టుకున్న ఆ దేశం.. ఏడున్నర దశాబ్దాల్లో పూర్తిగా దివాలా తీయగా, ఇప్పుడు ఆ దేశంలో ఆకలి, అవినీతి, నిరుద్యోగం మాత్రమే మిగిలాయి. ఒకవైపు దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించగా, క్రమంగా ప్రజలకు భద్రత కూడా కరువైపోతోంది. 1947లో దేశం ఏర్పడే సమయానికి ఆ దేశ జనాభా 3.1 కోట్లుగా ఉండగా, 2023 జనాభా లెక్కల ప్రకారం అది 24.1 కోట్లకు పెరిగింది. 2050 నాటికి పాకిస్థాన్ జనాభా 38 కోట్లకు చేరనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
పాకిస్థాన్‌లో పంజాబ్, సింధ్, బెలూచిస్థాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా పేరుతో 4 రాష్ట్రాలుండగా, ఇవిగాక పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో రెండు ప్రాంతాలు ముజఫరాబాద్, గిల్గిట్- బాల్టిస్థాన్‌లు ఉన్నాయి. అయితే ఒక పంజాబ్ మినహాయించి మిగిలిన అన్ని ప్రాంతాల్లో దాదాపుగా వేర్పాటువాదం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది క్రమంగా విస్తరిస్తూ.. ఆ దేశపు అస్థిత్వాన్నే కబళించే దిశగా సాగుతోంది. సౌత్ ఆసియా టెర్రరిజం పోర్టల్ గణాంకాల ప్రకారం పాక్‌లో 81 ఉగ్రవాద/తీవ్రవాద సంస్థలున్నాయి. వీటిలో 45 సంస్థలు.. అంటే యాభైశాతానికిపైగా నేటికీ యాక్టివ్‌గా ఉన్నాయి. లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ తదితర గ్రూప్‌లు ఇక్కడివే. ఇవన్నీ అల్‌కాయిదాతో ముడిపడి ఉన్నవే. పాక్ గడ్డ నుంచి ఆయా ఉగ్రమూకలు ఇతర దేశాలపై చిమ్మిన విషం అంతా ఇంతా కాదు. పలు జిహాదీ గ్రూపులు పాక్ ప్రభుత్వాన్ని, సైన్యాన్ని తమకు అనుకూలంగా ఎంతలా వాడుకున్నదీ తెలిసిందే.
మరోవైపు, దేశంలో సాగే పాలనలో, సైన్యంలో పంజాబ్ వారి పెత్తనం సాగుతోంది. జనాభాలో పంజాబ్ రాష్ట్ర వాటా కనీసం 40 శాతం కాగా, వనరులు మాత్రం తక్కువే. దీంతో వీరు ఇతర రాష్ట్రాల వనరులను దోచుకుంటూ వస్తున్నారన్న వాదన ఉంది. ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా దేశంలో వేర్పాటువాదం బలపడింది. అంతకుముందు బ్రిటిషు పాలనలో సంస్థానంగా ఉన్న బెలూచిస్థాన్ నుంచి పాకిస్థాన్ ఏర్పడింది. అనంతరం బలవంతంగా విలీనం చేయడంతో సహజ వనరులు అధికంగా ఉన్నప్పటికీ స్థానికులకు ఇవ్వకుండా దోచుకోవడం మొదలు పెట్టారు. దీంతో బెలూచీలు తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాటం మొదపెట్టారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న గ్వదర్ నౌకాశ్రయం నుంచి చైనాలోని కాష్గర్ వరకు ‘చైనా పాకిస్థాన్ ఆర్థిక నడవా’ను నిర్మించారు. ఆ తర్వాత బెలూచీల ఉద్యమాన్ని తీవ్రంగా అణిచివేయడంతో వారంతా అప్పటినుంచి గెరిల్లా పోరాటం చేస్తున్నారు. దేశ విభజన కాలంలో లక్షలమంది ముహజర్లు భారత్ నుంచి సింధ్‌కు వెళ్లి స్థిరపడ్డారు. అయితే పంజాబీ పాలకులు వారిపై చిన్నచూపు చూడటంతో తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలన్న ఉద్యమం ప్రారంభమైంది. స్థానిక సింధ్ ప్రజల నుంచి ఈ డిమాండ్‌కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ వచ్చింది. కాగా, దేశానికి జీవనాడైన కరాచీ రేవు ఈ రాష్ట్రంలో ఉంది.
అటు.. పాక్‌లోని వాయువ్య రాష్ట్రం ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఫస్తోన్ జాతీయవాదం బలంగా ఉంది.పొరుగున ఉన్న అఫ్ఘానిస్థాన్‌లోనూ వీరి సంఖ్య మెజార్టీగా ఉంది. దీంతో రెండు దేశాల మధ్య డ్యూరాండ్ రేఖ ఉన్నా.. సన్నిహిత సంబంధాలు, బంధుత్వాలు ఉన్నాయి. అయితే, అప్ఘాన్ వాసులు తమ దేశంలోకి నచ్చిన రీతిలో రాకపోకలు సాగించటం కుదరదంటూ పాక్ సైన్యం తరచూ సరిహద్దును మూసివేస్తోంది. దీనిపై ఫస్తూన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు, ఇస్లామిక్ చట్టాలను కఠినంగా అమలు చేయాలనే డిమాండ్‌తో పాక్ సర్కారుకు వ్యతిరేకంగా 2007లో టీటీపీ(తెహ్రీకే తాలిబాన్ పాకిస్థాన్) అనే సంస్థ ఏర్పడింది. నాలుగేళ్ల నాడు అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడటంతో పాకిస్థాన్‌లోని ఈ సంస్థ బలం వేయిరెట్లు అయింది. టీటీపీ నాయకుల్లో అత్యధికులు అఫ్ఘానిస్థాన్‌లో ఆశ్రయం పొందుతూ, వీలుదొరికినప్పుడల్లా పాక్‌లో రక్తపాతం సృష్టించటంతో పాక్ పాలకులు తలపట్టుకోవాల్సి వస్తోంది. మరోవైపు, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో గిరిజన తెగలదే ప్రాబల్యం. తమ ప్రాంత వనరులను అడ్డగోలుగా దోచేసి, పాక్ తన ఖజానా నింపుకుంటోందని వారు నిరసలను చేపడుతున్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను పంజాబ్‌కు తరలించటానికి నిరసనగా, గిల్గిట్-బాల్టిస్థాన్‌లో పెద్దఎత్తున ఉద్యమిస్తున్నారు.
ఇదిలా ఉండగా, 2024 చివరిలోపాక్ ఆర్థిక వ్యవస్థ విలువ సుమారు 347 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి రుణం తీసుకుని రోజులు నెట్టుకొస్తున్న దివాలా దేశంగా నేడు పాకిస్థాన్ మారింది. నిరుడు 7 బిలియన్ యూఎస్ డాలర్ల రుణం అందించినందుకు గానూ ఐఎంఎఫ్ పెట్టిన అనేక షరతులకు పాక్ ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే దేశంలోని ఆరు మంత్రిత్వ శాఖలను రద్దు చేయటంతో బాటు రెండు మంత్రిత్వ శాఖలను విలీనం చేయటం, వివిధ మంత్రిత్వ శాఖలలో లక్షన్నర ఉద్యోగాలను రద్దుచేయటం వంటి కీలక నిర్ణయాలున్నాయి. మరోవైపు పొరుగున ఉన్న చైనాతో తప్ప మూడు వైపులా ఉన్న ఇరాన్, అప్ఘానిస్థాన్, భారత్‌తో వైరం పెట్టుకున్నందున, సైన్యం ఒత్తిడితో అక్కడి ప్రభుత్వం ఇంత సంక్షోభంలోనూ నిరుటి 18 లక్షల కోట్ల బడ్టెట్‌లో ఏకంగా 2.1 లక్షల కోట్లను (ఏకంగా 12 శాతం) రక్షణ శాఖకు నిధులు కేటాయించాల్సి వచ్చింది. దేశంలో పలు రంగాలకు నిధుల సరఫరా లేకపోవటంతో అక్కడ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆర్థిక సంక్షోభం దెబ్బకు ఆరోగ్య రంగం అనారోగ్యం పాలైంది. వైద్యం చేయలేక సర్కారీ ఆసుపత్రుల్లోని డాక్టర్లు చేతులెత్తేస్తుండగా, రోగులు హాహాకారాలు చేస్తున్నారు. మెడిసిన్స్ తయారు చేయలేక ఫార్మా కంపెనీలు నష్టాల బాట పట్టటంతో మూతపడే స్థితికి చేరుకున్నాయి. మరోవైపు, నిత్యావసరాలు, ఇంధనం ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో దేశ ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు.
ఇక.. దేశాన్ని పాలించే ప్రభుత్వం ఏ పార్టీదైనా గత ఏడున్నర దశాబ్దాల కాలంలో అవినీతిని ఏ మాత్రం కదిలించలేకపోయాయి. దేశం అన్ని విధాలా సంక్షోభంలో కూరుకుపోతున్న పరిస్థితుల్లోనూ అవినీతికి అడ్డుకట్ట పడలేదు. అవినీతి సూచీలో ఆ దేశం 180 దేశాల్లో 133వ స్థానంలో నిలుస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడే జర్నలిస్టులకు దేశంలో భద్రత లేకుండా పోవటంతో, గత 30 ఏళ్లో 100కు పైగా పేరున్న పాత్రికేయుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ హత్యలకు పాల్పడిన వారిపై నేటికీ ఏ చర్యలూ లేవు. బ్రిటన్‌లో మంత్రిత్వశాఖలు, ప్రభుత్వ శాఖలకు మొత్తం 45 కార్లు ఉంటే.. ఒక్క సింధ్ రాష్ట్రంలోనే దాదాపు 25వేల అధికారిక వాహనాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి దిగజారినా.. దుబారాను తగ్గించుకోకపోవడం అనేది లేకుండా పోయింది. దేశంలో రాజకీయ అస్థిరత నెలకొనలేకపోవటం, ఏ ప్రభుత్వమైనా సైన్యం కనుసన్నల్లో నడవక తప్పని పరిస్థితి కావటంతో చట్టబద్ధపాలన అనేమాటకు అర్థం లేకుండా పోయింది. మొత్తం మీద పాకిస్థాన్ నేడు మరెప్పటికీ కోలుకోలేనంత అగాథంలోకి జారుకొంటోంది. ఈ పరిస్థితిలో అక్కడి ప్రజలు చైతన్యవంతులై ప్రజాస్వామ్య పంథాలో పయనిస్తే తప్ప ఆ దేశం తన ఉనికి ని నిలబెట్టుకునే అవకాశాలు తక్కువే. అదే నిజమైతే.. అట్లాంటిక్ కౌన్సిల్ సర్వే అంచనా వేసినట్లు ఆ దేశం తన ఉనికిని కోల్పోవటానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.