Earthquake in Turkey 5.8 Magnitude: తుర్కియోలో భూకంపం సంభవించింది. మధ్యధరా తీరప్రాంత పట్టణం మార్మారిస్‌లో 5.8 తీవ్రతతో భూకంపం వచ్చిందని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు.
కాగా, గ్రీస్, టర్కీ సరిహద్దులోని డోడెకానీస్ దీవుల్లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం 68 కిలోమీటర్ల లోతులో గుర్తించింది. భూకంపం కేంద్రం మధ్యధరా సముద్రంలో కేంద్రీకృతమై ఉందని చెప్పింది.
తెల్లవారుజామున 2.17 నిమిషాలకు సంభవించినట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. గ్రీకు ద్వీపం ప్రాంతాల్లో కంపించగా.. ప్రజలు నిద్రలో నుంచి ఉలిక్కిపడినట్లు టర్కీ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రజలు భయంతో కిటికీలు, బాల్కనీల నుంచి బయటకు దూకారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొంతమందికి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.