Donald Trump intresting satements in Presidential Inauguration rally: మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపేస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ ‘మేము గెలిచాం’ అంటూ ప్రమాణస్వీకారోత్సవ వేళ ట్రంప్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ట్రంప్ స్నేహితులు, మద్దతుదారులు, నిజమైన అమెరికన్ దేశభక్తులు అధిక సంఖ్యలో హాజరైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.
మన దేశాన్ని మనం తిరిగి స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేపు మధ్యాహ్నం వరకు నాలుగు సంవత్సరాల అమెరికా క్షీణతకు తెరపడుతుందన్నారు. అమెరికన్ బలం, శ్రేయస్సు, గౌరవం, గర్వంతో సరికొత్త రోజును ప్రారంభించనున్నామన్నారు. మహిళల క్రీడల్లో ట్రాన్స్ జెండర్లు పాల్గొనకుండా నిలువరిస్తానని అన్నారు. ప్రపంచంలో కనీవినీ ఎరుగని విధంగా అక్రమ వలసదారులకు చెక్ పెట్టి బయటకు పంపిస్తానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అలాగే టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని కొత్త ప్రభుత్వ వ్యవస్థను నిర్మిస్తానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దీంతో ఎలాన్ మస్క్ హర్షం వ్యక్తం చేశారు. ట్రంప్ నాయకత్వంలో అనేక మార్పులను చేయడానికి తాము ఎదురుచూస్తున్నట్లు మస్క్ తెలిపారు. విక్టరీ ఇక్కడి నుంచి మొదలైందని వెల్లడించారు. శతాబ్ధాల పాటు అమెరికాను పటిష్టంగా మార్చేందుకు పునాదిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అంటూ నినదించారు.