Donald Trump announces reciprocal tariffs against India from April 2: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశాడు. వచ్చే నెల నుంచి భారత్‌కు సైతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ సంయుక్త సెషన్‌లో ప్రసంగించారు. ఈ మీటింగ్‌లో ట్రంప్ సుమారు 1.40 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగించారు. అయితే, ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ సెషన్‌లో ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ సెషన్‌లో భారత్, చైనా, కెనడా దేశాలపై సుంకాలు విధించనున్నట్లు స్పష్టం చేశారు.
భారత్, చైనా సహా పలు దేశాలపై ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రానున్నట్లు ట్రంప్ ప్రకటించారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికాపై కొన్ని దేశాలు అధిక సుంకాలు విధిస్తున్నాయి. యూరోపియన్ యూనియన్, చైనా బ్రెజిల్, భారత్ వంటి చాలా దేశాలు తమ నుంచి అధిక సుంకాలు వసూలు చేస్తున్నాయి. ఇది చాలా అన్యాయం అని ట్రంప్ చెప్పారు. భారత్ అమెరికాపై వంద శాతం కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తుంది. ఇక అమెరికా వసూలు చేసే దానికంటే చైనా రెండింతలు ఎక్కువగా సుంకాలు విధిస్తోంది. ఇప్పుడు తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాము కూడా సుంకాలు విధించేందుకు సిద్ధమయ్యామని ట్రంప్ తెలిపారు.
ఏ దేశాలు.. తమ ఉత్పత్తులపై ఎంత టారిఫ్లు విధిస్తాయో.. తాము కూడా అంతే సుంకాలు వసూలు చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. తన దేశం ఎదుర్కొంటోన్న ద్రవ్యోల్బణ సమస్యపై ప్రస్తావిస్తూ.. జో బైడెన్ పాలనలోని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. చమురు, గ్యాస్ తవ్వకాల గురించి తన ఆలోచనలు వెల్లడించారు. ఏ దేశానికీ లేనివిధంగా మన కాళ్ల కింద ద్రవరూప బంగారం (చమురు, గ్యాస్ను ఉద్దేశించి) ఉందని, అది ద్రవ్యోల్బణ సమస్యను తీరుస్తుందన్నారు. ద్రవ్యోల్బణ సమస్యను పారదోలడం కోసం మేం చేసే పోరాటంలో భాగంగా ఇంధన వ్యయాన్ని వేగంగా తగ్గించడంపై దృష్టిపెట్టామన్నారు. బైడెన్ పాలనలో 100కు పైగా విద్యుత్ మూసివేశారని, మేం ఇప్పుడు తెరవబోతున్నామని వెల్లడించారు. అందుకే నేను అధికారంలోకి రాగానే జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని విధించానని, మన కాళ్ల కింద బంగారాన్ని తోడటం ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అన్నారు.