Texas Accident: అమెరికా లోని టెక్సాస్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. టెక్సాస్ నగరంలోని బ్రౌన్స్‌విల్లేలో ఈ ఘటన చోటు చేసుకుంది.
బ్రౌన్స్‌విల్లే పోలీసు అధికారి మార్టిన్ శాండోవల్ తెలిపిన వివరాలు ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో అతివేగంగా వచ్చిన ఓ ఎస్‌యూవీ కారు అదుపుతప్పి బస్టాండ్‌లో బస్సుకోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 7 గురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
మృతులందరూ వలసదారులే.. (Texas Accident)
ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించినట్లు మార్టిన్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన వారు వలసదారులుగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనే దానిపై దర్యాప్తు చేపట్టామన్నారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.