Britian: ఈ ఏడాది బ్రిటన్‌లో ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజుల పాటు విపరీతమైన ఎండలు కాస్తాయని తాజాగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇంగ్లండ్‌లో పాటు వెల్స్‌లో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవచ్చునని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అడవుల్లో కార్చిచ్చులు రగలవచ్చునని, నీటి సరఫరాలో అంతరాయంతో పాటు రవాణా సేవలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరించింది.
వాతావరణ శాఖ ఆరెంజ్ ఎలెర్ట్ జారీ చేసింది. ఆదివారం వరకు ఎండలు మాత్రం మండిపోతాయని, ఎండ వేడిమిని తట్టుకోలేని వారు ఇంటిపట్టునే ఉండాలని సూచించింది. అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇంగ్లండ్‌లో ఈ రోజు 35 డిగ్రీల సెల్సియస్, శనివారం 36 డిగ్రలకు చేరవచ్చునని అంచనా వేసింది వాతావరణశాఖ. లండన్‌లో ఎండలకు గడ్డి ఎండిపోయి చిన్న నిప్పు కణికపడ్డ మంటలు ఏర్పడే అవకాశాలున్నాయని లండన్ ఫైర్ బ్రిగెడియన్ అసిస్టెంట్ కమిషనర్ జోనాథన్ స్మిత్ నిన్న తెలియజేశారు.
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఫైరింజన్ సర్వీసులను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌లో 1935 తర్వాత మొట్టమొదటిసారి గత నెలలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ దాటింది. ఇంగ్లండ్‌తో పాటు ఇతర యూరోపియన్ యూనియన్ దేశాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిపోతోంది. ఎండలకు పలు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.