Plane crash in Khazakasthan: ఘోర విమాన ప్రమాదం.. 65మందికిపైగా దుర్మరణం!

Azerbaijan Airlines Plane Crashes Near Aktau City In Kazakhstan: కజికిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో ఉండగా ఓ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మందికిపైగా మరణించినట్లు సమాచారం. వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న అజర్ బైజాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం అక్టౌ ప్రాంతానికి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చాలా మంది మృత్యువాత పడ్డారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 72 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 67 మంది ప్రయాణికులు ఉండగా.. ఐదుగురు సిబ్బంది ఉన్నారు. అయితే ఆరుగురు మాత్రం ప్రాణాలతో బయటపడినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి వెల్లడించారు. ఈ విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తుండగా.. ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.

ఇదిలా ఉండగా, గ్రోజ్నీలో పొగమంచు కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి పక్షులు కారణమని ప్రాథమిక సమాచారం. పొగమంచు కారణంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతుండగా.. పక్షుల గుంపు ఒక్కసారిగా విమానాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలిందని చెబుతున్నారు.