Site icon Prime9

Editor Krishnarao: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కృష్ణారావు మృతి

Editor krishna rao

Editor krishna rao

Editor Krishnarao: చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ఏమంటూ వచ్చిందో అప్పటి నుంచి ప్రముఖులంతా వరుసగా ఈ లోకాన్ని వీడుతున్నారు. ఇటీవల కృష్ణం రాజు, కృష్ణ, సత్యనారాయణ, చలపతిరావు, జమున, దర్శకుడు విశ్వనాథ్, వాణీ జయరామ్ మృతి చెందగా.. శనివారం నాడు తారకరత్న, కోలీవుడ్‌ హస్యనటుడు మయిల్‌ స్వామి కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాదం అలుముకుంది. కాగా ఇప్పుడు తాజాగా టాలీవుడ్‌లో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సీనియర్‌ ఎడిటర్‌ జీజీ కృష్ణారావు కన్నుమూశారు. మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు.

ఇటీవల కాలంలో వరుసగా టాలీవుడ్‌లో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. శంకరాభరణం, సాగర సంగమం వంటి దాదాపు రెండు వందలకు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా కృష్ణారావు పనిచేశారు. ఈ వరుస సీనియర్‌ సినీ ప్రముఖులు మరణాలు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.

సినీ రంగ ప్రవేశం..

గుడివాడ ఏఎన్‌ఆర్‌ కాలేజీలో ఎమ్మెసీ చేసిన జీజీ కృష్ణారావు ఆ తర్వాత మిలటరీలో చేరారు. కానీ సినిమాలపై ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలేసి పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. 1961-62లో ఎడిటింగ్‌లో కోర్స్ చేశారు. ఆ సమయంలోనే దర్శకుడు ఎడిటర్‌ ఆదుర్తి సుబ్బారావు కంట పడ్డారు. ఆయనతో పరిచయం సినిమాల వైపు నడిపించింది. ఆదుర్తి సుబ్బారావు ప్రోత్సాహంతో చెన్నై వెళ్లిన కృష్ణారావు అక్కడే ప్రాక్టికల్‌ చేసారు. ఆ తర్వాత ఆదుర్తి రూపొందించిన `జ్వార్‌ భాటా` చిత్రంతో కృష్ణారావు(Editor Krishnarao)ని ఎడిటర్‌గా పరిచయం చేశారు. `పాడవోయి భారతీయుడా` చిత్రంతో తెలుగులో ఎడిటర్‌గా పరిచయం అయ్యారు.

అలానే కె. విశ్వనాథ్, బాపు, జంధ్యాల, దాసరి నారాయణరావు సహా అనేకమంది ప్రముఖ టాలీవుడ్ దర్శకులతో కలిసి పనిచేశారు కృష్ణారావు. ముఖ్యంగా అప్పట్లో టాలీవుడ్‌లోని పూర్ణోదయ మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ వంటి నిర్మాణ సంస్థలతో కృష్ణారావుకి సన్నిహితం ఉండేది. కె విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన `శంకరాభరణం`, `సాగరసంగమం`, `సప్తపది`, `శుభసంకల్పం` చిత్రాలకు ఆయనే ఎడిటర్‌ గా చేశారు. అందులో `సప్తపది`, `సాగరసంగమం`, `శుభసంకల్పం` చిత్రాలకు ఎడిటర్‌గా నంది అవార్డులను అందుకున్నారు.

`సప్తపది`(1981) చిత్రం నుంచి ఎడిటర్‌ విభాగంలో నంది అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. తొలి అవార్డు జీజీ కృష్ణారావుకి దక్కడం విశేషం. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. విశ్వనాథ్‌ సినిమాలకు కృష్ణారావు ఎడిటర్‌గా ఉండాల్సిందే అనేట్టుగా మారిపోయింది. వీటితో పాటు ఎన్టీఆర్‌ హీరోగా దాసరి రూపొందించిన `సర్ధార్‌ పాపారాయుడు`, `బొబ్బిలిపులి`, బాపు దర్శకత్వంలో వచ్చిన `శ్రీరామరాజ్యం`, జంద్యాల తొలి చిత్రం `ముద్దమందారం`, అలాగే `నాలుగు స్థంభాలాట` వంటి రెండు వందలకు పైగా చిత్రాలకు జీజీ కృష్ణారావు ఎడిటర్‌గా పనిచేశారు. ఆయన మరణంతో టాలీవుడ్‌ మరోసారి షాక్‌కి గురయ్యింది. ఆయన మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Exit mobile version