Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఎక్కడ చూసినా అతడే కనిపిస్తాడు. సుమ తరువాత ఆ రేంజ్ పేరు తెచ్చుకున్న యాంకర్స్ లో ప్రదీప్ ముందు ఉంటాడు. ఇక ఇప్పుడు ప్రదీప్.. యాంకరింగ్ మానేసి హీరోగా మారాడు. అతను నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా.. ? మంచి హిట్ ను అందుకుంది.
మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చిన ప్రదీప్.. ఇప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొన్ని స్టేజి షోస్ కు దర్శకత్వం వహించిన నితిన్- భరత్.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన ప్రదీప్.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున ప్రభాస్ ఎలా గుర్తొస్తాడో.. బుల్లితెరపై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే ప్రదీప్ గుర్తొస్తాడు. ప్రదీప్ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.
కాస్ట్యూమ్ డిజైనర్ తో పెళ్లి.. బిజినెస్ మ్యాన్ కూతురుతో పెళ్లి.. నిర్మాత కూతురుతో పెళ్లి అంటూ పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. గత కొంతకాలంగా ప్రదీప్.. యంగ్ టీడీపీ ఎమ్మెల్యేతో ప్రేమాయణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి విదేశాల్లో పార్టీలు చేసుకున్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి.
తాజాగా ఈ వార్తలపై ప్రదీప్ స్పందించాడు. ” పెళ్లికి అంటూ స్పెషల్ గా ప్లాన్ చేసుకోలేదు. లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాను. కష్టపడుతున్నాను. నేను పెట్టుకున్న టార్గెట్స్, నేను కన్న కలలు అన్ని నిజం అయ్యేవరకు పెళ్లి గురించి ఆలోచించాలనుకోలేదు. వాటికి కొద్దిగా టైమ్ పడుతూ వచ్చింది. అయినా అనుకున్న టైమ్ లోనే అన్ని అవుతాయని నమ్ముతున్నాను.
ఈ మధ్యలో చాలామందితో నా పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఒక పొలిటీషియన్ తో నా పెళ్లి అని వచ్చిన వార్తలు నేను కూడా విన్నాను. అందులో నిజం లేదు. మొన్న రియల్ ఎస్టేట్ డాటర్ అన్నారు.. ఇప్పుడు ఈమె. అదొక సరదా అయిపోయింది” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ ఏడాదిలో అయినా ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి.