Prime9

Khaleja Re Release: ఖలేజా రీ రిలీజ్ – పాముతో థియేటర్లలో అభిమాని హల్‌చల్‌

Mahesh Babu Fan Entered Theatre with Snake: ఏపీలోని ఓ థియేటర్‌లో ఓ వ్యక్తి పాముతో హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. కాగా గత కొంతకాలంగా టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయా సినిమా హీరోల ఫ్యాన్స్‌ థియేటర్లలో సీన్స్‌ రీ క్రియేట్‌ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా మహేష్‌ బాబు ఖలేజా మూవీ రీ-రిలీజ్‌ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఖలేజా సినిమాను ప్రదర్శిస్తున్నారు.

 

దీంతో థియేటర్లలో మహేష్‌ ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని అత్యత్సాహంతో ఏకంగా పాముని థియేటర్‌కి తీసుకుని వచ్చాడు. ఈ సినిమాలోని సీన్లకు తగ్గట్టుగా ఫ్యాన్స్‌ రెడీ అయ్యి వచ్చారు. కొందరు ఏకంగా ఆస్పత్రిలో డ్రెస్‌లో రాగా.. మరికొందరు పూల కుండీలు తీసుకుని వచ్చారు. విజయవాడలోని ఓ అభిమాని అయితే ఓ సీన్‌ రీక్రియేట్‌ చేసేందుకు థియేటర్లలోని అభిమానులను ఒక్కసారిగా హడలేత్తించాడు. మూవీ ప్రారంభం సీన్‌లో హీరో ముఖానికి ముసుగు వేసుకుని చేతిలో పాముని పట్టుకుని విలన్లపైకి విసురుతాడు.

 

ఆ సీన్‌ పడగానే ఓ అభిమాని అచ్చం హీరోలా ముఖానికి ముసుగు వేసుకుని చేతిలో చిన్న పామును పట్టుకుని వచ్చాడు. అక్కడ ఒక అతను పాము పాము అంటూ అరవడంతో థియేటర్లలోని ప్రేక్షకులంతా హడలేత్తిపోయారు. నిజమైన పాము అనుకుని భయపడిపోయారు. అయితే పరీక్షించి చూడగా అది బొమ్మ పాము అని తెలిసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై నెటజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. అభిమాని తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar