Balagam Actor GV Babu Health Condition: చిన్న సినిమాగా వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమా ‘బలగం’. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు ప్రేక్షకులు మాత్రమే కాదు.. సినీ ప్రముఖులు సైతం అభిమానులు ఉన్నారు. సాధారణ ఆడియన్స్ నుంచి సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు మెచ్చిన ఈ సినిమాను జబర్దస్త్ కామెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించగా.. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించారు.
ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా.. కొమురయ్య ప్రధాన పాత్రలో నటించారు. వారితో పాటు ఎందరో పల్లె కళకారులు ఈ సినిమాలో భాగమయ్యారు. వారిలో జీవీ బాబు ఒకరు. ప్రధనా పాత్ర పోషించిన కొమురయ్యకు తమ్ముడిగా అంజన్న పాత్రలో కనిపించారు జీవీ బాబు. ఈ సినిమా తర్వాత ఆయన రెండు, మూడు సినిమాలు చేశారు. కానీ, అవి పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. సినిమాలకు ముందు స్టేజ్ షోలు చేసుకునే ఆయన స్వతహాగా రంగస్థల కళాకారుడు. ఎన్నో స్టేజ్ షోలు, నాటకాలు కూడా వేసేవారు.
బలంగంతో మంచి గర్తింపు తెచ్చుకున్న జీవీ బాబు.. ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించింది. వైద్యానికి చేయించుకునే స్థితిలో కూడా లేడు. డబ్బులు లేక ధీనస్థితిలో ఉన్నాడు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. సమస్య మరింత తీవ్రం కావడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స కోసం చాలా డబ్బులు కావాల్సి ఉంది. దీంతో జీవీ బాబు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన ధీనస్థితి చూసి బలగం హీరో ప్రియదర్శి, దర్శకుడు వేణులు సాయం చేశారని, కానీ అది సరిపోలేదన్నారు. కాబట్టి ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీలో వాళ్లు ఆర్థిక సాయం చేయాలని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.