Site icon Prime9

Thandel Piracy: ఆర్టీసీ బస్సులో తండేల్‌ ప్రదర్శన – వారికి జైలు శిక్ష తప్పదు, అల్లు అరవింద్‌ హెచ్చరిక

Allu Aravind Reacts on Thandel Piracy: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్‌’ మూవీ విడుదలైన మంచి విజయం సాధించింది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే విడుదలైన రోజే ఈ చిత్రం ఆన్‌లైన్లో లీక్‌ అయ్యింది. అంతేకాదు ఓ లోకల్‌ టీవీలోనూ ప్రసారం చేశారు. ఇప్పుడు ఏకంగా ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ఈ సినిమాను ప్రదర్శించారు. తండేల్‌ మూవీపై పైరసీపై తాజాగా చిత్ర బృందం స్పందించింది.

ఈ మేరకు నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసులు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తండేల్‌ చిత్రాన్ని పైరసీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  “నిర్మాతలు, ఫిల్మ్‌ ఛాంబర్‌, ఓటీటీల చర్యల వల్ల కొన్నేళ్లుగా సినిమా పైరసీ ఆగింది. కానీ రెండు నెలల నుంచి మళ్లీ పెరిగింది. మొన్న దిల్‌ రాజు సినిమా ఇలానే ఆన్‌లైన్లో లీక్‌ చేశారు. ఇప్పుడు మా సినిమాను. కొందరు వాట్సాప్‌ గ్రూపుల్లో లింకులు ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఈ పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ సెల్‌ నిరంతరాయంగా పని చేస్తోంది.

లింకులు షేర్‌ చేస్తున్న వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ ఆడ్మిన్‌లను గుర్తించి సైబర్‌ క్రైం దృష్టికి తీసుకువెళ్లాం. వారిని అరెస్ట్‌ చేయిస్తాం, ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులో సినిమా పైరసీ ప్రింట్‌ను ప్రదర్శించడం దారుణం. చిత్ర విజయాన్ని ఆస్వాదించే సమయంలో ఇదొక ప్రతిబంధకం” అని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిమినల్‌ కేసులు నమోదైతే వెనక్కి తీసుకోలేమని, పైరసీ చేసినవాళ్లు మాత్రమే కాదు దానిని డౌన్‌లోడ్‌ చేసుకున్న వాళ్లకు కూడా కేసులు వర్తిస్తాయననారు. తండేల్‌ సినిమా పైరసీ కాపీ ఓవర్సీస్‌ నుంచే వచ్చిందని, ఇది తమిళ ప్రింట్‌ నుంచి వచ్చిందన్నారు.

దానికి తెలుగు ఆడియో కలిపారని, పైరసీ కాపీని ప్రదర్శించవద్దని కేబుల్‌ ఆపరేటర్స్‌ని కూడా హెచ్చరిస్తున్నామని తెలిపారు. తండేల్‌ మూవీ ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో ప్రదర్శించడంతో నిర్మాత బన్నీ వాసు వెంటనే స్పందిస్తూ ఆ సంస్థ ఛైర్మన్‌కు సంప్రదించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ ఛైర్మన్‌ కొనకళ్ల నారాయణరావు దీనిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి వివరాలు సమర్పించాలని ఉత్తర్వులు ఇచ్చారు.

Exit mobile version
Skip to toolbar