Actor, director Manoj Kumar passes away: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తాజాగా, ఆరోగ్య సమస్యలు, వయోభారంతో ముంబైలోని ధీరూభాయ్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై బాలీవుడ్ సినిమా ప్రముఖులు పలువురు నివాళులర్పించారు.
వందల సినిమాల్లో నటించిన ఆయన ఉప్కార్, రోటీ కపడా ఔర్ మకాన్, జై హింద్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే, దేశభక్తి సినిమాలకు మనోజ్ కుమార్ ప్రసిద్ధి చెందారు. 1937 జులై 24న జన్మించిన మనోజ్ కుమార్.. 1965లో షాహీద్, 1967లో ఉప్కార్, 1970లో పురబ్ ఔర్ పశ్చిమ్ , 1974లో రోటీ కపడా ఔర్ మకాన్ వంటి దేశభక్తి సినిమాలను తెరకెక్కించి మంచి పేరు సంపాదించుకున్నారు.
భారతీయ సినిమాతో పాటు కళలకు ఆయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు చాలా ఫిల్మ్స్ అవార్డ్స్ అందుకున్నారు. మనోజ్ కుమార్‌ను భరత్ కుమార్ అని కూడా పిలుస్తుంటారు. కాగా, ఉప్కార్ మూవీలో మనోజ్ పోషించిన పాత్రకి ఆయనను భరత్ కుమార్‌గా పిలుస్తున్నారు.
ఇదిలా ఉండగా, 2025 ఫిబ్రవరి 21న మనోజ్ కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫార్జన్, గుండెపోటుతో కార్డియోజెనిక్ షాక్ కారణంగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా కొంతకాలంగా ఆయన డీకంపెన్సేటెడ్ లివర్ సిర్రోసిన్ వ్యాధితో పోరాడుతున్నారని, దీని కారణంగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందన్నారు.